మారుతీ రికార్డుల స్పీడ్
షేరుకి రూ. 125 డివిడెండ్
21 లక్షల వాహన విక్రయాలు
క్యూ4 లాభం రూ. 3,878 కోట్లు
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంతోపాటు పూర్తి ఏడాదికి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 48 శాతం జంప్‌చేసి రూ. 3,878 కోట్లను తాకింది. ఇది రికార్డుకాగా.. ఇందుకు జోరందుకున్న ఎస్‌యూవీ అమ్మకాలు, తగ్గిన కమోడిటీ ధరలు, వ్యయ నియంత్రణలు సహకరించాయి.
అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో కేవలం రూ. 2,624 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా షేరుకి రూ. 125 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 30,822 కోట్ల నుంచి రూ. 36,697 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 13 శాతం అధికంగా 5,84,031 వాహనాలు విక్రయించింది. వీటిలో దేశీయంగా 5,05,291 యూనిట్లు విక్రయిస్తే.. 22% అధికంగా 78,740 వాహనాలు ఎగుమతి చేసింది.
టాప్ ఎక్స్‌పోర్టర్
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతీ వాహన విక్రయాలు సరికొత్త రికార్డును నెలకొల్పుతూ 20 లక్షల యూనిట్లను అధిగమించాయి. దాదాపు 9 శాతం వృద్ధితో 21,35,323 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో దేశీ విక్రయాలు 18,52,256కాగా.. 2,83,067 వాహనాలను ఎగుమతి చేసింది. తద్వారా మొత్తం ప్యాసింజర్ వాహన దేశీ ఎగుమతుల్లో 42 శాతం వాటాను ఆక్రమించింది. వెరసి వరుసగా మూడో ఏడాదిలోనూ టాప్ ఎక్స్‌పోర్టర్‌గా నిలిచింది. ఇక 2023–24లో నికర లాభం 64 శాతం దూసుకెళ్లి రూ. 13,209 కోట్లను అధిగమించింది. నికర అమ్మకాలు 20 శాతం వృద్ధితో రూ. 1,34,938 కోట్లకు చేరగా.. 2022–23లో ఇవి రూ. 1,12,501 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ4 సహా పూర్తిఏడాదికి లాభాలు, అమ్మ కాలలో సరికొత్త రికార్డులు సాధించినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. తొలిగా వీటిని యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయనున్నాం.
–ఆర్‌సీ భార్గవ, మారుతీ చైర్మన్
లాభాల స్వీకరణతో మారుతీ షేరు బీఎస్‌ఈలో 1.7 శాతం నీరసించి రూ. 12,687 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment