వ్యాపార రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ తారస్థాయిలో ఉన్నప్పటికీ టెస్లా కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ మాత్రం అవేవి ఎరగనట్టు చైనాలో వ్యాపారాన్ని విస్తరించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇందులో భాగంగానే చైనాలో అతి పెద్ద బ్యాటరీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నాడు.
నివేదికల ప్రకారం, చైనాలోని షాంఘైలో భారీ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మస్క్ ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే ఇక్కడ దాదాపు 10,000 మెగాఫ్యాక్ స్టోరేజీ యునిట్లను ఉత్పత్తి చేసేలా ఈ కంపెనీ నిర్మాణం చేపట్టనున్నట్లు టెస్లా ఆలోచిస్తోంది. ఇప్పటికే కాలిఫోర్నియాలో మెగా ప్లాంట్ కలిగి ఉన్న టెస్లా మరో భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టనుంది.
(ఇదీ చదవండి: నరేంద్ర మోదీని ఫాలో అవుతున్న మస్క్.. వైరల్ అవుతున్న నెటిజన్ల కామెంట్స్)
అమెరికాలో ఉన్న టెస్లా ఫ్యాక్టరీకి అదనంగా చైనాలో ఈ కంపెనీ ప్రారంభించనున్నట్లు సీఈఓ మస్క్ వెల్లడించారు. ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త ప్లాంట్ నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు మస్క్ చెబుతున్నారు. అంటే 2024 నాటికి ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని చైనా మీడియా వెల్లడించింది.
చైనా ఇప్పటికే అత్యధికంగా బ్యాటరీలు ఉత్పత్తి చేసే దేశంగా కీర్తి గడించింది. దీనిని ఆసరాగా తీసుకుని టెస్లా అతి తక్కువ ధరకే బ్యాటరీలను తయారు చేయాలని సంకల్పించింది. 2019లో మొదటి సారి చైనాలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ కూడా షాంఘైలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం సుమారు 22వేల కంటే ఎక్కువ వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి.
(ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నార?)
జర్మనీలోని బెర్లిన్ సమీపంలో ఇప్పటికే టెస్లాకు ఒక ప్లాంట్ ఉంది. ఇది కాకుండా కంపెనీ మెక్సికోలోని మాంటెర్రీలో ప్లాంట్ నిర్మించనున్నట్లు గతంలో వెల్లడించింది. అయితే ఇప్పుడు చైనాలో భారీ ప్లాంట్ ఏర్పాటుకు మస్క్ తీవ్రంగా యోచిస్తున్నాడు.
నిజానికి గతంలో వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రభుత్వం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అక్కడి సంస్థలకు సూచించింది. ఇదే సమయంలో చైనాలో కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే కొన్ని సంస్థలు వెనక్కి తగ్గాయి. ఇది ఇలాగే మరో పది సంవత్సరాలు కొనసాగే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ నిబంధనలను అతిక్రమించి మస్క్ ప్లాంట్ ఏర్పాటు చేయడం విడ్డూరమే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment