త్వరలో కొత్త కార్మిక చట్టాలు: ఉద్యోగుల జీతాల్లో వచ్చే మార్పులు ఇవే? | New Labour Laws: Companies Need To Pay Employees In Case Of More Than 30 Unused Leaves - Sakshi
Sakshi News home page

కొత్త కార్మిక చట్టాలు: ఉపయోగించుకోని లీవ్‌లు 30 కంటే ఎక్కువ ఉంటే సంస్థలు.. ఉద్యోగులకు డబ్బులు చెల్లించాల్సిందే

Published Wed, Sep 6 2023 11:31 AM | Last Updated on Wed, Sep 6 2023 12:14 PM

New Labour Laws: Companies Need To Pay Employees More Than 30 Unused Leaves - Sakshi

ఉద్యోగులకు శుభవార్త. పని-జీవిత సమతుల్యతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో పలు మార్పులు చేస్తూ.. వాటిని అమల్లోకి తెచ్చేలా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చితే లీవ్‌ల విషయంలో ఉద్యోగులు మరింత లబ్ధి పొందనున్నారు. 30 రోజులకు మించి సెలవుల్ని (leave) క్లయిమ్ చేయకపోతే ఉద్యోగులకు కంపెనీలు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని మార్పులు చేసిన కార్మిక చట్టంలో ఉంది. 

కేంద్రం గత ఏడాది వేతనాల కోడ్‌, సామాజిక భద్రత కోడ్‌, పారిశ్రామిక సంబంధాల కోడ్‌, భద్రత-ఆరోగ్యం- పని పరిస్థితులకు సంబంధించిన కోడ్‌ పేరుతో రూపొందించింది. నాలుగు కోడ్‌లకు పార్లమెంట్‌లో సైతం ఆమోదం పొందింది. అయితే, అవి ఇంకా అమల్లోకి రాలేదు. చట్టాల అమలు తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ తరుణంలో ఉద్యోగుల సెలవుల్ని ఎన్‌క్యాష్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ కార్మిక చట్టాల్లో మార్పులు తేనున్నట్లు ఎకనమిక్స్‌ టైమ్స్‌ నివేదించింది. అయితే లేబర్‌ కోడ్‌లలో మార్పులకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. 

ఉద్యోగులకు ఉపయోగమే 
ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్ 2020 ప్రకారం.. లీవ్ బ్యాలెన్స్ 30 దాటితే అదనపు సెలవులను కార్మికులు ఎన్‌క్యాష్‌ చేసుకోవచ్చు. ఈ ఎన్‌క్యాష్‌ అనేది ప్రతి ఏడాది క్యాలెండర్‌ ఇయర్‌ చివరిలో జరుగుతుంది. లేబర్ కోడ్‌ ప్రకారం.. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే లీవ్‌లు వినియోగించుకోకపోతే నిర్విర్యం కావు. వాటిని మరుసటి ఏడాదికి పొడిగించుకోవచ్చు. లేదంటే ఎన్‌క్యాష్‌ చేసుకోవచ్చు. కానీ సంస్థలు వార్షిక (ఏడాది annual) ప్రాతిపదికన లీవ్ ఎన్‌క్యాష్‌ చేసుకునేందుకు అనుమతించడం లేదు. ఈ క్రమంలో కేంద్రం మార్పులు చేసిన కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగులు లబ్ధి చేకూరనుంది. 

లీవ్‌ ఎన్‌ క్యాష్‌మెంట్‌ అంటే?
కార్మిక చట్టం ప్రకారం ప్రతి సంవత్సరం నిర్దిష్ట సంఖ్యలో సంస్థలు ఉద్యోగులకు లీవ్‌లు ఇస్తుంటాయి. సంస్థలు అందించే మొత్తం లీవ్‌లను ఉద్యోగులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు మరుసటి ఏడాది లీవ్‌లను వినియోగించేలా పొడిగించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. తన చట్టబద్ధమైన సెలవులను ఉపయోగించుకోని (ప్రైవేట్‌) ఉద్యోగులు.. ఆ సెలవులకు బదులుగా ఆ మేరకు నగదును పొందడాన్నే లీవ్ ఎన్ క్యాష్ మెంట్ (leave encashment) అంటారు.


న్యాయ వాద నిపుణులు ఏమంటున్నారు?
అయితే, కార్మిక చట్టాల్లోని మార్పులపై న్యాయవాద నిపుణులు స్పందిస్తున్నారు. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 32 (ఓఎస్హెచ్ కోడ్) సెక్షన్ 2020లో వార్షిక సెలవులు పొందడం, క్యారీ ఫార్వర్డ్, ఎన్‌క్యాష్‌ ఇలా సంబంధించి అనేక షరతులు ఉన్నాయి. సెక్షన్ 32(30) ప్రకారం ఒక ఉద్యోగి గరిష్టంగా 30 రోజుల వరకు వార్షిక సెలవులను మరుసటి ఏడాదికి ట్రాన్స్‌ఫర్‌ (క్యారీ ఫార్వర్డ్‌) చేసుకోవచ్చు. క్యాలెండర్ ఇయర్ చివరిలో వార్షిక సెలవుల బ్యాలెన్స్ 30 దాటితే, ఉద్యోగి అదనపు సెలవులను ఎన్‌ క్యాష్‌ చేసుకోవడానికి లేదంటే మరో ఏడాదికి పొడిగించుకోవడానికి అర్హత ఉందని ప్రముఖ న్యాయ సంస్థ ఇండస్‌లా ప్రతినిధి సౌమ్య కుమార్ తెలిపారు. 


 
కొత్త కార్మిక చట్టాల్ని రూపొందించింది.. కానీ 
గత ఏడాది, కేంద్ర ప్రభుత్వం 4  కొత్తగా కార్మిక చట్టాల్ని రూపొందించింది. వాటిల్లో కార్మికుల కోసం కేటాయించిన మొత్తం 29 చట్టాలను కలిపి నాలుగు కోడ్‌లుగా మార్చింది. ఇందులో నాలుగు చట్టాలను వేతన కోడ్, 9 చట్టాలను సోషల్ సెక్యూరిటీ కోడ్‌, 13 చట్టాలను ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్, మరో 3 చట్టాలను ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌లుగా రూపొందించింది. వాటిని జులై 01, 2022నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని భావించింది. ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, అనేక రాష్ట్రాలు ఇంకా కొత్త కోడ్‌లను ఆమోదించలేదు. రాజ్యాంగం పరిధిలో కార్మిక అంశం ఉన్నందున అమలులో జాప్యం జరిగింది. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తాయి. ఈ కోడ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement