సరికొత్త రూపం సంతరించుకున్న నిస్సాన్ మాగ్నైట్ ఎట్టకేలకు భారత్‌లో విడుదలైంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది విసియా, విసియా ప్లస్, ఏసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ అనే ఆరు వేరియంట్‌లలో, రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ తొలిసారిగా 2020లో పరిచయమైంది. అప్పటి నుంచి కంపెనీలో ప్రధాన మోడల్ కారుగా ఉంటూ వచ్చింది. 2023 ఏప్రిల్‌లో ఈ మోడల్‌ను కంపెనీ నిలిపేసింది. ఎగుమతులతో కలుపుకొని మొత్తం 1.5 లక్షల మాగ్నైట్ కార్లను విక్రయించినట్లు కంపెనీ చెబుతోంది. ఆకర్షణీయమైన లుక్‌తో ఉండే ఈ కారును మరింత ఆకర్షణీయంగా ఫేస్‌లిఫ్ట్ చేసి 2024 మోడల్‌గా కంపెనీ విడుదల చేసింది.
తాజా నిస్సాన్ మాగ్నైట్ పాత ఫీచర్లతోనే వచ్చినప్పటికీ డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేశారు. ముందుభాగంలో సరికొత్త ఫ్రంట్ బంపర్‌తోపాటు ఫ్రంట్ గ్రిల్ ఇచ్చారు. అలాగే ఆటోమెటిక్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు బై ఫంక్షనల్ ప్రొజెక్టర్‌తో ఇచ్చారు. అల్లాయ్ వీల్స్ కొత్త డిజైన్లో ఉన్నాయి. వెనకవైపు టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేకమైన డీటైలింగ్, స్మోక్‌డ్ ఎఫెక్ట్‌తో ఇచ్చారు. రియర్ బంపర్ డిజైన్ కూడా మార్చారు.
ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. క్యాబిన్ మొత్తానికి మార్చకుండా చిన్నపాటి మార్పులు చేశారు. లోపలవైపు లెదర్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, వైర్‌లెస్ చార్జర్ సరికొత్త ఆకర్షణగా చెప్పుకోవచ్చు. మరోవైపు సేఫ్టీ ఫీచర్లలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగులు, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment