న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో సమర్పించే బడ్జెట్ .. ఓట్ ఆన్ అకౌంట్ మాత్రమేనని, అందులో ఎటువంటి అద్భుతమైన ప్రకటనలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాంటి వాటి కోసం, ఎన్నికలయ్యాక ఏర్పడే కొత్త ప్రభుత్వం జూలైలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే దాకా ఎదురు చూడాల్సిందేనని ఆమె తెలిపారు. సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.
ఎన్నికల ముంగిట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ .. కొత్త సర్కార్ కొలువు తీరే వరకు అయ్యే ప్రభుత్వ వ్యయాలకు ఆమోదం పొందేందుకు ఉద్దేశించి ఉంటుంది. దీన్ని ఓట్ ఆన్ అకౌంట్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇలాంటి వాటిలో ప్రభుత్వం భారీ ప్రతిపాదనలేమీ చేయదు. మరోవైపు, అన్ని రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడంతో రెండో క్వార్టర్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అత్యధికంగా నమోదైనట్లు రాజ్యసభలో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్ కొనసాగుతోందని ఆమె చెప్పారు. గత ఎనిమిదేళ్ల వ్యవధిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎకానమీల జాబితాలో భారత్ 10వ స్థానం నుంచి అయిదో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా, పీఎల్‌ఐ (ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల స్కీము) వంటి తోడ్పాటు చర్యలతో తయారీ రంగం కూడా ఎకానమీ వృద్ధిలో గణనీయంగా పాలుపంచుకుంటోందని మంత్రి చెప్పారు. నిరుద్యోగిత రేటు 2017–18లో దాదాపు 18 శాతంగా ఉండగా ప్రస్తుతం 10 శాతానికి దిగి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment