ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ అనే పేరుతో తమ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని ప్రకటించింది. రోడ్‌స్టర్ ప్రో , రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్ అనే మూడు వేరియంట్లను గురువారం తమ వార్షిక ఈవెంట్ “సంకల్ప్” సందర్భంగా లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 74,999 నుంచి రూ. 2,49,999 మధ్య ఉండనున్నాయి. మూడు మోడల్స్‌కు రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి.
చౌకైన రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ మోడల్‌లు 2.5 KwH నుంచి 6 Kwh బ్యాటరీ బ్యాక్‌లతో వస్తాయి. 2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వీటి డెలివరీలు ప్రారంభమవుతాయి. అలాగే ప్రీమియం రోడ్‌స్టర్ ప్రో 8 KwH, 16 KwH వేరియంట్‌లలో 2025 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటుందని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్
రోడ్‌స్టర్ ఎక్స్ 11 kW గరిష్ట మోటార్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. 3 బ్యాటరీ ప్యాక్ ఎంపికలు- 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh ఉన్నాయి. వీటిలో టాప్ వేరియంట్ 124 కి.మీ గరిష్ట వేగం, 200 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) తోపాటు 4.3-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఓలా మ్యాప్స్ నావిగేషన్ వంటి అనేక రకాల డిజిటల్ టెక్ ఫీచర్‌లను అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ యాప్ కనెక్టివిటీతో వస్తుంది. 2.5 kWh వేరియంట్ ధర రూ. 74,999, 3.5 kWh రూ. 84,999, 4.5 kWh మోడల్ ధర రూ. 99,999.
ఓలా రోడ్‌స్టర్
రోడ్‌స్టర్ 13 kW మోటారుతో ఆధారితమైనది. ఇందులో 3.5 kWh, 4.5 kWh, 6 kWh బ్యాటరీ వేరియంట్‌లు ఉన్నాయి. టాప్ వేరియంట్ గరిష్టంగా 126 కి.మీ గరిష్ట వేగం, 248 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. 6.8-అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్, ప్రాక్సిమిటీ అన్‌లాక్, క్రూయిజ్ కంట్రోల్, పార్టీ మోడ్, ట్యాంపర్ అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్‌లతో పాటు కృత్రిమ్ అసిస్టెంట్, స్మార్ట్‌వాచ్ యాప్, రోడ్ వంటి ఏఐ- పవర్డ్ ఫీచర్‌లతో వస్తుంది. మోటార్‌సైకిల్ ముందు, వెనుక వైపున డిస్క్ బ్రేక్‌లు, ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. 3.5 kWh మోడల్ ధర రూ. 1,04,999, 4.5 kWh రూ.1,19,999, 6 kWh ధర రూ.1,39,999.
ఓలా రోడ్‌స్టర్ ప్రో
ఈ శ్రేణి మోటర్ సైకిళ్లు 52 kW గరిష్ట పవర్ అవుట్‌పుట్, 105 Nm టార్క్‌తో కూడిన మోటారుతో వస్తాయి. 16 kWh వేరియంట్ 194 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. 579 కిమీ రేంజ్‌ను ఇస్తుంది. ఇది సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైనది మాత్రమే కాకుండా అత్యంత సమర్థవంతమైన మోటార్‌సైకిల్‌గా కూడా నిలిచింది. రోడ్‌స్టర్ ప్రోలో 10-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్‌లు, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లకు ఏబీఎస్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో 8 kWh వేరియంట్ ధర రూ. 1,99,999, 16 kWh వేరియంట్ ధరను రూ. 2,49,999 లుగా కంపెనీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment