న్యూఢిల్లీ: సరళతర ద్రవ్య పరపతి విధానం దిశలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మరో కీలక చర్య తీసుకునేందుకు వీలు కల్పించే ఆర్థిక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2020 డిసెంబర్‌లో 4.59 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించి పరిగణనలోకి తీసుకునే ఉత్పత్తుల బాస్కెట్ ధర 4.59 శాతం పెరిగిందన్నమాట. 15 నెలల కనిష్ట స్థాయి ఇది.
ఇక పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2020 నవంబర్‌లో 1.9 శాతం క్షీణించింది. అంతక్రితం రెండు నెలలు వృద్ధి బాటలో నడిచిన సూచీ మళ్లీ క్షీణతను చూడ్డం గమనార్హం. కేంద్రం ఆర్‌బీఐకి ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 6 – 2 శాతం శ్రేణిలో (ప్లస్2 లేదా మైనస్2తో 4 శాతం వద్ద) ఉండాలి. ఈ లెక్కన తాజా సమీక్షా నెల్లో రిటైల్ ద్రవ్యోల్బణం గాడిన పడినట్లే భావించాల్సి ఉంటుంది. 2021 ఫిబ్రవరి 3 నుంచి 5 వరకూ ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన ద్వైమాసిక సమావేశం జరగనుంది.
పారిశ్రామిక ‘పేలవం’
కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020 మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 18.7 శాతం క్షీణించింది. అటు తర్వాత ఆగస్టు 2020 వరకూ మైనస్‌గానే కొనసాగింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా 0.48 శాతం, 4.2 (అక్టోబర్‌లో గత 3.6 శాతం అంచనాల నుంచి మరింత మెరుగుపరచడం జరిగింది) శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే నవంబర్‌లోనే తిరిగి క్షీణతను నమోదుచేసుకున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయ తాజా ప్రకటన వివరించింది. 2019 నవంబర్‌లో ఐఐపీ 2.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. తాజా సమీక్షా నెల 2020 నవంబర్‌లో వేర్వేరుగా వివిధ రంగాల తీరును చూస్తే....
- తయారీ: ఎకానమీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన ఈ విభాగం 1.7 శాతం క్షీణించింది.
- మైనింగ్: క్షీణత 7.3 శాతం.
- విద్యుత్: ఈ విభాగంలో 3.5 శాతం వృద్ధి నెలకొంది.
- భారీ యంత్ర పరికరాలు, డిమాండ్‌కు సంకేతంగా పరిగణించే క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తిలో 7.1 శాతం క్షీణ రేటు నమోదయ్యింది.
- కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 0.7 శాతం పడిపోయింది.
- నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్: ఇక దుస్తులు, సబ్బులు, టూత్ పేస్టుల ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) విభాగానికి సంబంధించిన ఈ విభాగంలో సైతం 0.7 శాతం క్షీణరేటే నమోదుకావడం ఆందోళనకరమైన అంశం.
ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 15.5 శాతం క్షీణత
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 15.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో స్వల్పంగానైనా 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది.
తగ్గిన ఆహార ధరా భారం...
రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో లక్ష్యాల మేరకు 4.59%కి దిగిరావడానికి శాంతించిన ఆహార ఉత్పత్తుల ధరలు కొంత కారణం. ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయిలోకి రిటైల్ ద్రవ్యోల్బణం దిగిరావడం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే తొలిసారి. కూరగాయల ధరలు నవంబర్‌లో 10.41% తగ్గాయి (నవంబర్‌లో 15.63% పెరుగుదల). ఆహార ద్రవ్యోల్బణం మొత్తంగా చూస్తే, 3.41% తగ్గింది (16 నెలల కనిష్టం). నవంబర్‌లో ఈ రేటు 9.5%. తృణ ధాన్యాల ధరల్లో కేవలం 0.98% పెరుగుదల నమోదయ్యింది. నవంబర్‌లో 2.32% పెరుగుదల రేటు ఉంది. తాజా గణాంకాల నేపథ్యంలో ఆర్‌బీఐ రేటు కోత లేదా ప్రస్తుత సరళ విధానం కొనసాగించడానికి మార్గం సగమం అయ్యిందని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment