ఎన్నిసార్లు రైల్లో ప్రయాణం చేసినా,రిజర్వేషన్ ఉన్నాకూడా ట్రాఫిక్ మహా సముద్రాన్ని ఈది స్టేషన్‌కు చేరి, ట్రైన్ ఎక్కి మన సీట్లో మనం కూర్చునేదాకా మహా గొప్ప టెన్షన్.. అలాగే ఎంత అనుభవం ఉన్నా.. ఎన్నిసార్లు గాల్లో విహరించినా ఎక్కిన ఫ్లైట్ దిగేదాకా విమాన ప్రయాణం అంటే అదో అలజడి. ఎలాంటి వారికైనా కొద్దో.. గొప్పో..ఈ ఒత్తిడి తప్పదు కదా.
బహుశా అందుకేనేమో శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. USA టుడే ప్రకారం బ్లాక్ అండ్ వైట్ రెస్క్యూ క్యాట్ ఇటీవలే విమానాశ్రయంలోని వాగ్ బ్రిగేడ్‌లో చేరింది. విమాన ప్రయాణీకుల ఒత్తిడిని, ఆందోళనను తగ్గించేందుకు ఈ అందమైన పిల్లి సిద్ధంగా ఉంటుంది. ఈ తరహా థెరపీని అందిస్తున్న మొదటి పిల్లి డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్. 14 ఏళ్ల థెరపీ క్యాట్ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సరికొత్త ఉద్యోగి. మా డ్యూక్ అసలు ఎవర్నీ నిరాశపర్చదు. ఒక్క క్షణం డ్యూక్‌ని పలకరిస్తే ప్రయాణ టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఎలాంటి భయం, బెరుకూ లేకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణీకులతో ఎలా మెలాగాలో, వారిలో ఒత్తిడిని పొగొట్టి, నవ్వులు ఎలా పూయించాలో కూడా ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారట. యానిమల్ థెరపిస్ట్‌గా సర్టిఫికేట్ కూడా పొందిందట.
ఎయిర్‌పోర్ట్‌లో ఊపుకుంటూ తిరుగుతూ, పలకరిస్తూ, నవ్వులు పూయిస్తున్న డ్యూక్‌ని చూసిన ప్రయాణికులు, అందులోనూ క్యాట్ లవర్స్ తెగ మురిసిపోతున్నారట. దీంతో డ్యూక్‌ని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో యానిమల్ కేర్ అండ్ కంట్రోల్ 2010లో ఆకిలితో ఉన్న ఈ పిల్లిని గుర్తించడంతో ఒక కుటుంబం దీన్ని దత్తత తీసుకుంది శాన్ ఫ్రాన్సిస్కో సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ ద్వారా డ్యూక్ థెరపీ యానిమల్ శిక్షణ పొందింది.
కాగా శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కార్యక్రమాన్ని 2013లో ప్రారంభించింది. సర్టిఫైడ్ థెరపీ జంతువులను టెర్మినల్స్‌లో ఉంచుతుంది. తద్వారా ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడమే లక్ష్యమని విమానాశ్రయ అధికారుల మాట.
Comments
Please login to add a commentAdd a comment