క్యూ2లో రూ. 19,782 కోట్లు
తగ్గిన మొండిబకాయిలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 23 శాతం జంప్‌చేసి రూ. 19,782 కోట్లను తాకింది. వడ్డీయేతర ఆదాయం, ట్రెజరీ లాభాలు పుంజుకోవడం ఇందుకు తోడ్పాటునిచ్చాయి. స్టాండెలోన్ లాభం సైతం రూ. 18,331 కోట్లకు ఎగసింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 14,330 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 5 శాతంపైగా పుంజుకుని రూ. 41,620 కోట్లకు చేరింది.
రుణాల్లో 15 శాతం వృద్ధి ఇందుకు సహకరించినప్పటికీ నికర వడ్డీ మార్జిన్లు 0.15% నీరసించి 3.14 శాతానికి పరిమితమయ్యాయి. ఫారెక్స్, ట్రెజరీ మద్దతుతో వడ్డీయేతర ఆదాయం 42% జంప్‌చేసి రూ. 15,721 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 1.29 లక్షల కోట్లకు చేరింది. రుణాల్లో 14–16% వృద్ధిని అంచనా వేస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. అయితే డిపాజిట్లలో వృద్ధి 10 శాతానికి పరిమితంకావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో(ఏప్రిల్–సెపె్టంబర్) రూ. 63,895 కోట్ల నిర్వహణ లాభం సాధించినట్లు తెలియజేశారు. ఈ బాటలో నికర లాభాల్లోనూ రూ. లక్ష కోట్ల మార్క్‌ను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎన్‌పీఏలు తగ్గాయ్...
ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్‌బీఐ తాజా స్లిప్పేజీలు రూ. 3,831 కోట్లకు పరిమితంకాగా.. రూ. 2,300 కోట్ల రికవరీలు అందుకుంది. త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 2.21 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 13.76 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థల విషయానికొస్తే జీవిత బీమా విభాగం నికర లాభం ఆరు నెలల్లో రూ. 761 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు జంప్‌చేసింది. క్రెడిట్ కార్డుల విభాగం లాభం మాత్రం రూ. 1,196 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు తగ్గింది. ఏఎంసీ నికర లాభం రూ. 940 కోట్ల నుంచి రూ. 1,374 కోట్లకు పెరిగింది. ఇక సాధారణ బీమా సంస్థ లాభం రూ. 60 కోట్ల నుంచి రూ.414 కోట్లకు ఎగసింది.
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ధర 2 శాతం నష్టంతో రూ.843 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment