ముంబై: అమెరికా ద్రవ్యోల్బణం డేటా ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. దీంతో బుధవారం ఈక్విటీ మార్కెట్ అస్థిరంగా చలించి, చివరికి కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాల్లో మగిసింది. అమ్మకాల ఒత్తిడికి ఉదయం సెషన్‌లో సెన్సెక్స్, నిఫ్టీ పావు శాతం వరకు నష్టాన్ని చూశాయి. కానీ, అక్కడి నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం సూచీలను తిరిగి లాభాల బాట పట్టించింది. సెన్సెక్స్ మొత్తం మీద 400 పాయింట్ల శ్రేణిలో 61,573 నుంచి 61,974 మధ్య చలించింది.
చివరికి పావు శాతం లాభంతో (179 పాయింట్లు) 61,940 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 22 లాభపడ్డాయి. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,315 పాయింట్ల వద్ద క్లోజయింది. మార్కెట్లు లాభాల్లో ముగియడం వరుసగా ఇది మూడో రోజు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కువ శాతం ప్రతికూలంగా ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌లో అత్యధికంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3 శాతం లాభపడింది. నష్టపోయిన వాటిల్లో ఎస్‌బీఐ, టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్ ఉన్నాయి.
‘‘దేశీ మార్కెట్ ఫ్లాట్‌గా ట్రేడ్ అయింది. యూఎస్ మార్కెట్ చుట్టూ నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మార్కెట్ల పట్ల సానుకూలంగా వ్యవహరించలేదు‘‘అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లు మరో రోజు స్థిరీకరణ చెందాయని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రియల్టీ, ఇంధనం, ఆటో రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించినట్టు చెప్పారు.
యూఎస్ వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాల విడుదల కానుండడంతో అంతర్జాతీయంగా మార్కెట్లు స్తుబ్దుగా ట్రేడయ్యాయి. సియోల్, టోక్యో, షాంఘై, హాంగ్‌కాంగ్ నష్టాల్లో ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment