నేడు(17న) దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 82 పాయింట్లు క్షీణించి 11,530 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,612 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం బలపడేటంతవరకూ మరికొంతకాలం నామమాత్ర వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పేర్కొన్న నేపథ్యంలో బుధవారం యూఎస్ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్లు నేడు ఆటుపోట్ల మధ్య ట్రేడ్‌కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
చివరి సెషన్‌లో జోరు
బుధవారం స్వల్ప ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 259 పాయింట్లు ఎగసి 39,303 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు పుంజుకుని 11,605 వద్ద స్థిరపడింది. అయితే తొలి సెషన్‌లో మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గులను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,360- 39,038 పాయింట్ల మధ్య, నిఫ్టీ 11618- 11517 పాయింట్ల మధ్య ఒడిదొడుకులను చవిచూశాయి.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,542 పాయింట్ల వద్ద, తదుపరి 11,479 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,643 పాయింట్ల వద్ద, ఆపై 11,681 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,307 పాయింట్ల వద్ద, తదుపరి 22,040 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 22,750 పాయింట్ల వద్ద, తదుపరి 22,926 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 265 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 212 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,171 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 896 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 298 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 120 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment