కొత్త ఏడాదిలోనూ రోజూ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఏదో ఒక కంపెనీలో లేఆఫ్‌ల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గ్లోబల్ డేటా ప్రొటెక్షన్, రాన్సమ్‌వేర్ సంస్థ వీమ్ (Veeam) 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఇటీవలి మార్పులతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది.
కంపెనీలో తొలగింపుల గురించి కొంతమంది ఉద్యోగులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్లాక్ అండ్ ఫైల్స్ ప్రకారం.. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా తనతోపాటు సుమారు 300 మంది సహోద్యోగులు జాబ్స్ కోల్పోయారని ఒక సీనియర్ క్యాంపెయిన్ అకౌంట్ మేనేజర్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. తొలగింపులను గురించి కంపెనీ ధ్రువీకరించినప్పటికీ ఎంత మంది ఉద్యోగులను తొలగించారన్న ఖచ్చితమైన సంఖ్యను మాత్రం నిర్ధారించలేదు.
2006లో స్థాపించిన ఈ ఐటీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల మందికి పైగా సేవలందిస్తూ పరిశ్రమలో ప్రధాన సంస్థగా మారింది. కంపెనీ కస్టమర్ లిస్ట్‌లో ప్రపంచంలోని అతిపెద్ద బ్రాండ్‌లైన కోకా-కోలా, బీఎండబ్ల్యూతో పాటు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి.
తమ వ్యాపార ప్రణాళికలను బహిర్గతం చేయమని వీమ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాథ్యూ బిషప్ తెలిపారు. అయితే తాము కొన్ని చోట్ల నియామకాలను పెంచుతున్నామని, కొన్ని మందిని బదిలీ, మరికొంత మందిని తప్పిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభావితమైన వీమ్ ఉద్యోగులు తదుపరి కెరీర్ అవకాశాన్ని కనుగొనడంలో వారికి సహాయం అందిస్తామన్నారు.
వీమ్ సంస్థ రాన్సమ్‌వేర్, ఇతర సైబర్ ముప్పుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించడంతో ప్రసిద్ది చెందింది. 2023లో నగదు, స్టాక్ డీల్‌లో 150 మిలియన్ డాలర్లకు కుబెర్నెట్స్ బ్యాకప్, డిజాస్టర్ రికవరీలో అగ్రగామిగా ఉన్న కాస్టెన్ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. భారతీయ సంతతికి చెందిన ఆనంద్ ఈశ్వరన్ 2022లో వీమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment