ముంబై: మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతుండటంతో సోమవారం దేశీ సూచీలు క్షీణించిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా ఒకే రోజున ఏకంగా రూ. 7.59 లక్షల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు రోజుల వ్యవధిలో కీలక సూచీల పతనంతో బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12,51,700 కోట్ల మేర హరించుకుపోయి రూ. 311,30,724 కోట్లకు క్షీణించింది.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సెన్సెక్స్ 826 పాయింట్లు (1.26%) క్షీణించి రూ. 64,572 వద్ద, నిఫ్టీ 261 పాయింట్లు (1.34%) తగ్గి 19,282 వద్ద క్లోజయ్యాయి. దసరా సందర్భంగా దేశీ మార్కెట్లు మంగళవారం పని చేయలేదు. గత బుధవారం నుంచి వరుసగా నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 1,925 పాయింట్లు పతనమై కీలకమైన 65,000 మార్కు దిగువకు పడిపోయింది. నిఫ్టీ 530 పాయింట్లు తగ్గింది.
ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలకు తోడు ద్రవ్యోల్బణం, మరో దఫా వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు, అంతర్జాతీయంగా అనిశ్చితి మొదలైన వాటిపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొందని, మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడిందని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. సెన్సెక్స్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, విప్రో, ఎస్‌బీఐ మొదలైనవి క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment