ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్త. ప్రముఖ దేశీయ కార్ మేకర్ టాటా మోటర్స్ '2 మిలియన్ ఎస్‌యూవీ వేడుక'లో భాగంగా తమ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని పలు వాహనాలపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. పాపులర్ టాటా నెక్సాన్ ఈవీపై గరిష్టంగా రూ. 2.05 లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది.
ఈ సెప్టెంబర్ నెలలో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. టాటా మోటర్స్ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), టియాగో ఈవీ (Tiago EV)లపై గ్రీన్ బోనస్‌లో భాగంగా క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 మోడల్‌లను ఎంచుకునే వారికి అదనపు తగ్గింపు లభిస్తుంది.
టాటా నెక్సాన్ ఈవీపై భారీ డిస్కౌంట్
టాప్ స్పెక్స్ ఉండే టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్+ లాంగ్ రేంజ్ వేరియంట్‌లపై ఈ నెలలో రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటర్స్. రూ. 20,000 తగ్గింపుతో లభించే ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ + ఎంఆర్ వేరియంట్ తప్ప మిగిలిన అన్ని వేరియంట్‌లు రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల వరకూ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.
2023లో తయారైన అన్ని మోడల్‌లపై అయితే రూ. 25,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం.. 30kWh వేరియంట్ 275 కి.మీ, 40.5kWh యూనిట్ 390 కి.మీ. రేంజ్ ఇస్తాయి.
ఇతర ఈవీలపైనా..
ఇక టాటా మోటర్స్ డిస్కౌంట్ అందిస్తున్న ఇతర ఈవీలలో టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ ఉన్నాయి. వీటిలో టాటా టియాగో ఈవీలపై గరిష్టంగా రూ.65,000, అలాగే టాటా పంచ్ ఈవీలపై రూ.30,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment