అన్ని పరిశ్రమలలోనూ కంపెనీల మధ్య పోటీ అనేది సర్వ సాధారణం. అయితే ఇది ఐటీ కంపెనీల తారస్థాయికి చేరింది. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో భారతీయ ఐటీ కంపెనీ విప్రో కఠిన నిబంధన అమలు చేస్తోంది. ఈ నిబంధన కంపెనీ మారిన ఉన్నత ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది.
విప్రో నుంచి వైదొలిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలో వారి చివరి రోజు నుంచి ఒక సంవత్సరం పాటు 10 ప్రత్యర్థి సంస్థలలో చేరలేరు. ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ నుంచి నిష్క్రమించిన వెంటనే ఈ కంపెనీలలో దేనిలోనూ చేరకుండా వారిని నిరోధించే వారి కాంట్రాక్ట్‌లోని నాన్-కాంపిటేట్ నిబంధన దీనికి కారణం.
ఈ నిబంధన ఆధారంగా ప్రత్యర్థి కంపెనీ కాగ్నిజెంట్‌లో చేరిన తమ మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌ను విప్రో ముప్పుతిప్పలు పెడుతోంది. నిబంధన ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గానూ నష్టపరిహారం కింద వడ్డీతో సహా రూ. 25.15 కోట్లు కట్టాలని కోర్టులో దావా వేసింది.
విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే..
విప్రో ఎగ్జిక్యూటివ్‌ల కాంట్రాక్ట్‌లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్‌సీ టెక్నాలజీ, హెచ్‌సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్‌లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. అయినప్పటికీ ఆయన ప్రత్యక్ష పోటీదారు కంపెనీలో చేరాడని విప్రో వాదిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment