సాక్షి పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
కోయంబత్తూరుకు చెంది ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి.
ముగిసిన సాఫ్ట్‌బాల్ పోటీలు
మూడు రోజుల పాటు సాగిన రాష్ట్ర స్థాయి అండర్ –14 సాఫ్ట్‌బాల్ బాలబాలికల పోటీలు ఆదివారం ముగిశాయి.
సోమవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2024
జిల్లాలోని వసతి గృహాలు అధోగతి పాలవుతున్నాయి. అసలే చలి కాలం.. భవన కిటికీలకు, మరుగుదొడ్లకు తలుపులు లేవు.. పడకేసిన పారిశుధ్యం.. అడుగడుగునా నిర్లక్ష్యం.. కానరాని నీటి సదుపాయం.. కుళాయిలకు లీకేజీ.. ఆరుబయటే చన్నీటి స్నానం.. నేలపైనే నిద్రించాల్సిన దుస్థితి.. ఇది జిల్లాలోని సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లో కనిపిస్తున్న దయనీయ పరిస్థితులు. అరకొర సదుపాయాలతో వేలాది మంది పేద విద్యార్థులు వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులతో కాలం వెళ్లదీస్తున్నారు. వసతులు, సౌకర్యాలు మెరుగుపరచాలని న్యాయస్థానాలు ఆదేశించినా కూటమి పాలకులు, అధికారుల్లో చలనం మాత్రం కరువైంది. సాక్షి బృందం పరిశీలనలో వెలుగులోకి వచ్చిన సమస్యలపై ప్రత్యేక కథనం.
పుంగనూరు నియోజకవర్గం సదుం ఎస్సీ బాలుర వసతి గృహంలో వర్షానికి ఉరుస్తున్న పైకప్పు
జిల్లాలో వసతి గృహాల వివరాలు
ఎస్సీ వసతి గృహాలు 57
ఎస్టీ వసతి గృహాలు 03
ఏపీఎస్‌డబ్ల్యూఆర్ గురుకులాలు 07
బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలు 38
ట్రైబల్ గురుకులాలు 04
మహాత్మాగాంధీ పూలే గురుకులాలు 05
ఏపీ రెసిడెన్షియల్ గురుకులాలు 02
● సమస్యలతో విద్యార్థుల సహవాసం
● పారిశుధ్యం అధ్వానం
● తలుపుల్లేని మరుగుదొడ్లతో అగచాట్లు
● పట్టించుకోని అధికార యంత్రాంగం
చిత్తూరు కలెక్టరేట్ : పేద విద్యార్థులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం అన్నింటా...చిన్నచూపు చూస్తోంది. జిల్లాలోని వసతి గృహాల్లో ఎక్కడ చూసినా సమస్యలు తాండవిస్తున్నాయి. సంక్షేమ వసతి గృహాల్లో వెలగని బల్బులు... తలుపుల్లేని కిటికీలే కనిపిస్తున్నాయి. పారిశుధ్య నిర్వహణకు నిధుల్లేక వార్డెన్లు చేతులెత్తేశారు. దీంతో దోమలు వ్యాప్తి చెంది చిన్నారులు వ్యాధుల బారిన పడుతున్నారు. మెనూ సరిగ్గా అమలుకాకపోవడంతో నీళ్లచారు.. ముద్ద అన్నంతోనే విద్యార్థులు కడుపు నింపుకుంటున్నారు.
బినామీ ఉద్యోగులు
చిత్తూరు నగరం సంజయ్‌గాంధీనగర్‌లో ఉన్న ఎస్సీ ప్రీ–మెట్రిక్ వసతి గృహంలో బినామీ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఒక్క వసతి గృహంలోనే కాదు పలు సాంఘిక సంక్షేమ, బీసీ వసతి గృహాల్లో వంటమనిషి, కామాటిల కొరత ఉండడంతో వార్డెన్‌లు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకున్నారు. మరికొన్ని చోట్ల రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నా వారు హాస్టల్స్‌కు రాకుండా తమకు బదులుగా కొంత జీతం ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులతో నడుపుతున్నారు. పది రోజులకు ఒకసారి వారు వచ్చి పర్యవేక్షించి వెళ్తుంటారు.
సొంత డబ్బుతో సరుకులు
జిల్లాలోని 30 శాతానికి పైగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో టెండర్ల సమయం ముగిసింది. అయితే కొత్తగా ఇంత వరకు టెండర్లను పిలవలేదు. టెండర్లకు రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆమోదం లభించలేదు. దీంతో టెండర్ దారులు వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసర వస్తువులను నిలిపివేశారు. మరికొన్ని చోట్ల పెరిగిన ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ఇస్తేనే సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. టెండర్లు నిలిచిన వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో వార్డెన్‌లు రోజుకు రూ.2 వేల వరకు ఖర్చు చేసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తున్నారు.
అలంకారంగా ఆర్వో ప్లాంట్లు
వసతి గృహాలకు దాతలు ఇచ్చిన ఆర్‌వో ప్లాంట్‌లు మరమ్మతులకు గురికావడంతో మూలనపడ్డాయి. విద్యార్థులకు గ్లాసులు, ప్లేట్లు పంపిణీ చేయలేదు. మంచినీరు లేదు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ పెట్టెలు, వస్తువుల వద్దే నిద్రించాల్సిన దుస్థితి. ఆ పెట్టెలు కూడా విరిగిపోయి వంగి పోయాయి. వాటిలో దుస్తులు, పుస్తకాలు కానీ దాచుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చదువుకోవడానికి సరైన వసతుల్లేవు.
ఆరుబయటే..
వసతి గృహాల్లో సరైన మరుగుదొడ్లు, స్నానపుగదులు లేకపోవడం, కొన్ని చోట్ల ఉన్నా తలుపులు విరిగిపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెట్లు, పుట్ల వెంట పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళ బయటకు వెళితే విషపురుగుల బారిన పడతామేమోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
చిత్తూరు నగరంలోని సంజయ్‌గాంధీ నగర్‌లో ఉన్న ఎస్సీ ప్రీ మెట్రిక్ వసతి గృహంలో కుక్, కామాటి, వార్డెన్ లేరు. ఇన్‌చార్జి వార్డెన్‌తో హాస్టల్ నిర్వహిస్తున్నారు. వాచ్‌మెన్ బందువులతో వంటలు వండిస్తున్నారు. ఇక్కడే ఉన్న బీసీ పోస్ట్‌మెట్రిక్ వసతి గృహంలో కొన్ని నెలలుగా మరుగు దొడ్లకు తలుపులు లేవు. చెత్త కుప్పగా పేరుకుపోవడంతో దోమలు బెడద అధికంగా ఉంది.
చిత్తూరు కలెక్టరేట్‌కు సమీపంలో ఉన్న ఎస్సీ బాలుర పోస్ట్‌మెట్రిక్ వసతిగృహంలో 150 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వసతిగృహ నిర్వహణకు నిధులను ప్రభుత్వం ఇవ్వడం లేదు. కుక్, కామాటి కూడా లేరు. వార్డెన్ బయ టి వ్యక్తులను నియమించుకుని సొంత నిధుల తో వంట చేయించి విద్యార్థులకు పెడుతున్నారు. కిటికీలకు మెష్‌లు లేకపోవడంతో రాత్రి పూట విద్యార్థులు చలి, దోమలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పుంగనూరు నియోజకవర్గం సదుం ఎస్సీ బాలుర వసతి గృహంలో 68 మంది విద్యార్థులున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షం పడితే ఉరుస్తోంది. బోరు మరమ్మతులకు గురైంది. తాగునీటికి అవస్థలు తప్పడం లేదు. దాతలు ఇచ్చిన మినరల్ వాటర్ యంత్రం మూలన పడింది. చౌడేపల్లె హాస్టల్లో మరుగుదొడ్లు శుభ్రపరిచేవారు లేకపోవడంతో కంపుకొడుతున్నాయి. కుళాయిలు లేకపోవడంతో నీరువృథా అవుతోంది.
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం దండికుప్పం బీసీ వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలి యని పరిస్థితి. కుప్పంలోని బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు.
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని 49 కొత్తపల్లి మిట్ట ఎస్సీ బాలుర వసతి గృహంలో పై పెచ్చులూడి విద్యార్థులపై పడుతున్నాయి. మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఆరుబయటే స్నానం చేయాల్సి వస్తోంది. సురక్షితమైన తాగునీరు కూడా లేదు.
పలమనేరు నియోజకవర్గంలోని హాస్టళ్లలో కనీససౌర్యాలు లేవు. పారిశుధ్యం లోపించింది. అసలే వానాకాలం కావడంతో దుర్గంధం వెదజల్లుతోంది. కొలమాసనపల్లి హాస్టల్‌కు దారి సమస్య ఉంది. వర్షం కారణంగా దారిమొత్తం చిత్తడిగా మారింది. హాస్టల్ వెనుకవైపు నిర్మాణ దశలో ఉన్న గృహాల వద్ద మందుబాబులు వీరవిహారం చేస్తుంటారు. హాస్టళ్లలో విద్యార్థులకు కప్పుకోవడానికి బెడ్‌షీట్లు ఇవ్వలేదు. పట్టణంలోని గుడియాత్తం రోడ్డులో ఉన్న బీసీ హాస్టల్‌ను 36 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గదుల్లో పైకప్పు పెచ్చులు ఊడిపడుతోంది. ఇక్కడ దోమల బెడద ఎక్కువగా ఉంది. దీని పక్కనే ఉన్న ఎస్సీ–1, ఎస్సీ–2 హాస్టళ్లలోనూ విద్యార్థులు అవే సమస్యలు ఎదుర్కొంటున్నారు.
భద్రత కరువు
బాలికల వసతి గృహాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థినులకు రక్షణ కరువైంది. వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయకపోవడంతో బాలికలు అభద్రతా భావంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో పలు హాస్టళ్లల్లో రాత్రి వేళ్లల్లో ఆగంతకులు, ఆకతాయిలు, మందుబాబులు చొరబడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బాలికల హాస్టళ్లల్లో పురుషులను సిబ్బందిగా, ట్యూటర్లుగా నియమించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ అమలు కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment