ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు

Published Mon, Nov 25 2024 8:02 AM | Last Updated on Mon, Nov 25 2024 8:02 AM

ట్రాన

ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు

చిత్తూరు కార్పొరేషన్‌: పంటకు ప్రాణం నీరు. అది పొలంలోకి రావాలంటే విద్యుత్‌ అవసరం. అన్నదాత వ్యవసాయం చేయడానికి విద్యుత్‌ సర్వీసుల కోసం పడిగాపులు కాస్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేది పంపుసెట్ల ద్వారా అందే నీరే. జిల్లాలో సాగవుతున్న వరి, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలనూ ఇలా పంపుసెట్ల కింద రైతులు విరివిగా సాగుచేస్తున్నారు. వీటన్నింటికీ విద్యుత్‌ సరఫరా కీలకమైనా వాటి మెటీరియల్స్‌ లేక ఉమ్మడి జిల్లాలో దాదాపు 5,000 వరకు రైతులు నరకయాతన పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో పాటు సాధారణ రోజుల్లోనూ పంటల సాగులో వ్యవసాయ మోటార్ల వినియోగం జిల్లాలో బాగా పెరిగింది. అంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యవసాయ మోటార్లకు కావాల్సిన విద్యుత్‌ సర్వీసు కనెక్షన్లను వెంటనే మంజూరు చేయకుండా విద్యుత్‌శాఖ నెలల తరబడి పెండింగ్‌ పెడుతోంది. దీంతో రైతులకు పంటల సాగులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాదాపు 4 నెలలుగా విద్యుత్‌ శాఖ అధికారులు ఒక్క వ్యవసాయ విద్యుత్‌ సర్వీసును కూడా మంజూరు చేయకపోవడంతో కనెక్షన్‌ కోసం ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకున్న దాదాపు 5 వేల మంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

4 నెలలుగా ఒక సర్వీసు ఇస్తే ఒట్టు

ఉమ్మడి జిల్లాలో 5 వేల సర్వీసులు పెండింగ్‌

ట్రాన్స్‌ఫార్మర్‌, కేబుల్‌ కోసం నిరీక్షణ

స్టోర్స్‌లో కానరాని సామగ్రి

పట్టించుకోని విద్యుత్‌శాఖ

5 శాతం కూడా లేదు

ఉమ్మడి జిల్లాలో రైతులకు కావాల్సిన విద్యుత్‌ పరికరాలు స్టోర్స్‌ 5 శాతం స్టాక్‌ కూడా లేదు. ప్రస్తు తం దరఖాస్తుదారులకు 6వేల కిలోమీటర్లకు పైగా కండక్టర్‌ అవసరం ఉంది. అదే విధంగా ట్రాన్స్‌ఫార్మర్లు 5,000 వరకు అవసరం ఉన్నాయి. కానీ నిల్వ మాత్రం అందులో 250 కూడా లేవు. అయితే ఉన్న వాటిని రాజకీయ ఒత్తిళ్లతో అవసరమైన వారికి ఇండెంట్‌ పెట్టి అందజేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. సీనియారిటీ ప్రకారం కాకుండా సిఫార్సుల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడం గమనార్హం. ఇక పూర్తి స్థాయిలో మెటీరియల్స్‌ వచ్చి పని మొదలు పెట్టడానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు సుబ్రమణ్యం గంగవరం మండలం కొత్తపల్లెవాసి. 4 నెలల ముందు వ్యవసాయ బోరుకు సంబంధించి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం రూ.19,000 చెల్లించాడు. అప్పటి నుంచి రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అదిగో వచ్చేస్తుంది.. ఇదిగో వచ్చేస్తుంది అంటున్న అధికారుల మా టలపై ఆశలు పెట్టుకొని ఎదురు చూసి, చూసి పంట ఎండుముఖం పట్టింది. ఇక చేసేదేమీ లేక సమీప పొలం రైతు అనుమతితో ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నాడు. అది కూడా చాలకపోవడంతో ప్రస్తుతం వరి పైరు పూర్తిగా ఎండిపోయింది. ఇది ఒక రైతు పరిస్థితే కాదు జిల్లాలో వేలాది మంది రైతుల దీనస్థితి.

నెలలుగా తిరుగుతున్నాం

పంట పొలాలకు నీటి కోసం మోటార్‌ ఏర్పాటుకు విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకొనేందుకు దరఖాస్తు చేశాను. ఇప్పటికి మూడు నెలలకుపైగా తిరిగినా కనెక్షన్‌ ఇవ్వలేదు. నాతోపాటు ఇలా ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు కార్యాలయానికి వెళ్లిన మెటీరియల్స్‌ లేదంటున్నారు అధికారులు. ఇంకా ఎన్ని రోజులు వేచిచూడాలో తెలియడం లేదు. – పద్మనాభశెట్టి, కార్వేటినగరం

నెలలో వస్తాయి

వ్యవసాయ సర్వీసులకు వాడే విద్యుత్‌ పరికరాలు (మెటీరియల్స్‌) నెలలో జిల్లాకు రాను న్నాయి. తదనంతరం దశలవారీగా పరికరాలు వస్తుంటాయి. వాటిని సీనియారిటీ వారీగా రైతులకు అందించాలని అధికారులను ఆదేశించాం. మెటీరియల్స్‌ వచ్చిన వెంటనే అందజేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

– సంతోషరావు, సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్‌

మెటీరియల్స్‌ లేవంట

కనెక్షన్లు మంజూరు చేయక పోవడానికి ప్రధాన కారణం ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు, వైర్లు (మెటీరియల్స్‌) అందుబాటులో లేకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ శాఖకు చెంది న స్టోర్స్‌ చిత్తూరులో ఉంది. టిక్కడి నుంచి ఉమ్మడి జిల్లాకు మెటీరియల్‌ సరఫరా అవుతుంది. అయితే ఈ స్టోర్‌లో మెటీరియల్‌ లేకపోవడంతోనే వ్యవసాయ సర్వీసులను నిలిపివేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ సర్వీసులకు సంబంధించిన మెటీరియల్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది. ప్రతి నెలా కోటా ప్రకారం ఏపీ ఎస్పీడీసీఎల్‌ అధికారులు సీనియారిటీ ప్రకారం జిల్లా రైతులకు వెంటనే కనెక్షన్లు ఇస్తుండేవారు. కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మెటీరియల్‌ లేకపోవడంతో ఒక్క కనెక్షన్‌ కూడా ఇవ్వలేని పరిస్థితి. దీంతో తమకు ఎప్పుడు ఇస్తారో తెలియక వేలాది మంది అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఇలా ఇస్తారు

సాధారణంగా వ్యవసాయ విద్యుత్‌ సర్వీసు పొందాలంటే రైతులు సంబంధిత ఓల్టా, వీఆర్వో, బోర్‌వెల్‌ ధ్రువీకరణ పత్రాలతో మీ–సేవ కేంద్రాల్లో రూ.150 రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకుంటారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఏఈ, డీఈఈ, ఈఈల స్థాయిలను బట్టి అనుమతులు వస్తాయి. వెంటనే సంబంధిత రైతులు ఒక హెచ్‌పీ (హార్స్‌ పవర్‌)కి రూ.1,200 చొప్పున ఎన్ని హెచ్‌పీలు కావాలనుకుంటే అన్ని రూ.1200తో పాటు రూ.40 సెక్యూరిటీ డిపాజిటల్‌ విద్యుత్‌ సంస్థకు చెల్లించాలి. సర్వీసులు మంజూరు చేసిన తర్వాత కావాల్సిన ప్రాంతం నుంచి విద్యుత్‌ లైన్‌ దూరాన్ని బట్టి మూడు స్తంభాలు, 180 మీటర్ల ఎల్‌టీలైన్‌, ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ ఉచితంగా ఆ శాఖ అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇద్దరు, ముగ్గురు రైతులు ఒకే దగ్గర ఉంటే వారందరికీ కలిపి ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తారు. అయితే అదనపు స్తంభాలు, 180 మీటర్ల మించి ఎల్‌టీ లైన్‌ కావాలంటే నిబంధనల ప్రకారం రైతులు అదనంగా నగదును సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు1
1/2

ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు

ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు2
2/2

ట్రాన్స్‌ఫార్మర్‌ కష్టాలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement