రసాభాసగా డ్రైవర్ల సంఘం ఎన్నికలు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాల్సిన ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎన్నికలను రసాభాసగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎన్నికల కార్యాలయంలో ఆదివారం ఆ సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు విచ్చేసిన ఆ సంఘం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు ఏకపక్షంగా ఒకే వర్గానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికలకు జిల్లా వైద్యఆరోగ్య శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పన్నీర్‌సెల్వం (మాజీ జిల్లా అధ్యక్షులు), జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి చెందిన శ్రీనివాసన్ నామినేషన్‌లు దాఖలు చేశారు. పన్నీర్ సెల్వం దాఖలు చేసిన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయనే కారణం చూపి ఎన్నికల పరిశీలకులు చిరంజీవి నామినేషన్‌ను తిరస్కరించారు. బైలాలో లేని నిబంధనలను సాకుగా చూపి నామినేషన్‌ను తిరస్కరించారని పన్నీర్ సెల్వం ఆరోపించారు. ముందస్తు స్కెచ్ ప్రకారం ఏకపక్షంగా మరొక వ్యక్తిని గెలిపించేందుకు ఎన్నికల పరిశీలకులు కుట్ర చేశారన్నారు. దీంతో ఏకపక్షంగా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల తీరును ఎండగడుతూ పన్నీర్ సెల్వం మద్దతుదారులు సంఘ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన వెల్లడించారు.వ్యవసాయ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసన్‌ను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులుగా ప్రకటించి నియామకపత్రం అందజేశారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ డ్రైవర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment