ఎస్టీలపై అగ్ర కులస్తుడు దాడి
పాలసముద్రం : వనదుర్గాపురంలో ఎస్టీ కాలనీకి చెందిన వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తుడు దాడి చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్డుపై చెప్పులు వేసుకుని నడచవద్దని, ట్యాంకు నుంచి నీళ్లు పట్టుకోకూడదని అగ్రకులస్తుడు చెప్పాడన్నారు. తాము చెప్పిన తరువాత కూడా సిమెంట్ రోడ్డుపై చెప్పులు వేసుకుని నడిస్తే కాళ్లు, చేతులు ఉండవని బెదిరించారన్నారు. అధికారులకు చెప్పినా కనీస స్పందన లేదని వాపోయారు. దీంతో అతను పదేపదే బెదిరిస్తున్నట్లు బాధితులు తెలిపారు. తాము ఎస్టీ కులంలో పుట్టడమే తప్పా..! ఇలా అయితే జీవనం ఎలా సాగించాలన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు స్పందించి తమపై దాడి చేసిన అధికార పార్టీకి చెందిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సైనికుల సేవలు వెలకట్టలేనివి
చిత్తూరు కలెక్టరేట్ : దేశరక్షణ కోసం సేవలందిస్తున్న సైనికుల సేవలు వెలకట్టలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. భారత సాయుధ దళాల పతాక దినోత్సవం పోస్టర్లను బుధవారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయుధ దళాలు దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఏటా డిసెంబర్ 7వ తేదీన భారత సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని వీర సైనికుల సంక్షేమం, వారి కుటుంబాలకు సాయం చేయడం మన కర్తవ్యమని, జిల్లాలోని ప్రతి ఒక్కరూ సాయుధ దళాల పతాక నిధికి తమవంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు, సిబ్బంది వినాయకరెడ్డి, సాయిప్రకాష్, మాజీ సైనికుల సంఘ నాయకులు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
బీఎడ్ పరీక్షలకు
ఎగ్జామినర్ల ఆలస్యం
పలమనేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న బీఎడ్ పరీక్షలకు ఎగ్జామినర్లు పదినిమిషాలు ఆలస్యంగా వస్తున్నారని కొందరు విద్యార్థులు వాట్సాప్ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పరీక్ష సమయం 90 నిమిషాలు మాత్రమే ఉండగా అందులో పది నిమిషాలు అనవసరం వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ బాబును వివరణ కోరగా అలాంటిదేమీ లేదని, ఇకపై తాను సైతం పర్యవేక్షిస్తానని తెలిపారు.
కుక్కల దాడిలో
మహిళకు గాయాలు
పుంగనూరు: మండలంలోని పిచ్చిగుండ్లపల్లెకు చెందిన జయమ్మ (65) వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం మిట్టపల్లె సచివాలయానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వీధి కుక్కలు ఆమైపె ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో జయమ్మ తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment