● సీఎం చంద్రబాబు ఇలాఖాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు ● ప
మండలంలోని బుచ్చినాయుడుపల్లె పంచాయతీ పరిధిలోని స్వర్ణముఖినదిలో గత కొద్ది రోజులుగా హిటాచీ యంత్రాలతో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. గుట్టగుట్టలుగా ఇసుకను పోగు చేసి, అక్కడ నుంచి పగలు ట్రాక్టర్లు, రాత్రి వేళల్లో టిప్పర్‌లతో ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. స్వర్ణముఖినదిలో సుమారు 15 అడుగుల లోతు వరకు హిటాచితో తవ్వకాలు జరపడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. స్వర్ణముఖినదిలో అక్రమ ఇసుక రవాణా ఆపాలంటూ గతంలో నిరసనలకు దిగిన టీడీపీ నేత లు ఇప్పడు వారే ఇంతటి అవినీతికి పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వార్థం అనే గునపాన్ని
అక్రమార్కులు స్వర్ణమ్మ గుండెల్లో
దించుతున్నారు. కన్నీరింకిన స్వర్ణముఖి నదిలో ఇసుక
యథేచ్ఛగా తోడేస్తున్నారు. నదిలో
ఇసుకమేటలు మాయమై గోతులు
కనిపిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు. ఇందంతా రెవెన్యూ దృష్టికెళ్లినా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా ప్రకృతి సంపద కరిగిపోతోంది.
కేశవ రెడ్డి స్కూల్ వెనుక వైపు స్వర్ణముఖి నదిలో పట్టపగలే హిటాచీతో ఇసుక తోడుతున్న దృశ్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతల ధనదాహానికి అంతులేకుండా పోతోంది. ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ వైపు నది పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం చర్యలు శూన్యం. సీఎం చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో అఽధికార పార్టీ నేతల ఇసుక దోపిడీ తారాస్థాయికి చేరుకుంటోంది. ఏకంగా భారీ యంత్రాలతో స్వర్ణముఖి నదిని తోడేస్తూ, స్వర్ణమ్మకు తూట్లు పొడుస్తున్నారు.
సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తాం
స్వర్ణముఖి నదిలో భారీ యంత్రాలతో ఇసుకను తోడేయడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. సీఎం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించడంపై గురువారం నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో ఫిర్యాదు చేస్తామని రైతులు చెబుతున్నారు.
పట్టపగలే హిటాచీతో ఇసుక తవ్వకాలు
రెవెన్యూకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
గత రెండు రోజుల పాటు కేశవరెడ్డి స్కూల్ వెనుక వైపు భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారని ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావ్విస్తోంది. అక్రమంగా హిటాచీతో ఇసుకను తోడేయడంతో ఘటనా స్థలానికి వెళ్లిన వీఆర్వోలు అధికార పార్టీకి చెందిన ఆ నేతతో మంతనాలు జరిపి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల కంటి ముందే హిటాచీ ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని రైతులు మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఆ నేత మండలంలోని పలు శాఖలకు చెందిన కొంత మంది అధికారులకు నెల నెలా ముడుపులు ముట్టజెప్పడంతోనే తామేమీ ఎరగనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు పరోక్షంగా సహకరిస్తున్న వారిపై కఠన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment