రహదారుల పక్కన ఆపిన లారీల్లో అర్ధరాత్రి దాటాక డీజిల్‌ మాయం | - | Sakshi
Sakshi News home page

రహదారుల పక్కన ఆపిన లారీల్లో అర్ధరాత్రి దాటాక డీజిల్‌ మాయం

Published Thu, Nov 28 2024 1:47 AM | Last Updated on Thu, Nov 28 2024 1:47 AM

రహదార

రహదారుల పక్కన ఆపిన లారీల్లో అర్ధరాత్రి దాటాక డీజిల్‌ మా

● డ్రైవర్లు ఘాడనిద్రలోకి జారుకోగానే ఇంధనం కాజేస్తున్న దొంగలు ● పొద్దున లేచి చూసేసరికి డీజిల్‌ లేక డ్రైవర్ల ఇబ్బందులు ● యజమానులకు చెబితే తిట్లదండకం ● పలమనేరు సమీపంలోని నాగమంగళం వద్ద తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు

పలమనేరు: జాతీయ రహదారి పక్కన ఆపి ఉంచిన లారీల్లో నుంచి డీజిల్‌ మాయం అవుతోంది. అర్ధారత్రి దాటిన తరువాత కొందరు ఆయిల్‌ దొంగలు ఈ పని పడుతున్నారు. చైన్నె–బెంగళూరు హైవేలో చిత్తూరు వైపు నుంచి వచ్చే లారీలు మధ్యలో ఆపుదామంటే మొగిలిఘాట్‌ ఉంది. అక్కడ ఏనుగుల సంచారం ఉండడంతో పట్టణ సమీపంలోని నాగమంగళం సేఫ్‌గా ఉంటుందని డ్రైవర్లు భావిస్తారు. అదేవిధంగా బెంగళూరు వైపు నుంచి వచ్చే లారీలు సైతం పత్తికొండ ఫారెస్ట్‌ దాటగానే సురక్షతిమైన తావు ఇదే. దీనికితోడు ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా హోటళ్లు ఉంటాయి. లారీలను ఆపుకునేందుకు సైతం ఇక్కడ వెసులుబాటు ఉంటుంది. దీంతో గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే డ్రైవర్లు రాత్రుల్లో లారీలను ఆపి అక్కడి హోటళ్లలో తిని లారీలో పడుకుని వేకువజామున వెళ్తుంటారు.

ఏమాత్రం అనుమానం రాకుండా..

ఈ హైవేలో నిత్యం 40 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇందులో 20 వేల దాకా లారీలే ఉంటాయి. ముఖ్యంగా రాత్రుల్లో లారీలు ఎక్కువ. ఇక్కడ వాహనాలను ఆపి, డ్రైవర్లు ఘాడ నిద్రలోకి జారుకుంటారు. ఇదే సమయంలో ఇక్కడే సంచరించే ఆయిల్‌ దొంగలు ఓ చోట ఆటో ఆపుకుని ఉంటారు. డ్రైవర్లు నిద్రలో ఉన్నట్లు నిర్ధారించుకుని, లారీ లోపలకు వెళ్లి ట్యాంకర్‌ నుంచి ఇంజిన్‌ ఉండే పైపును ఆక్సాబ్లేడ్‌తో కట్‌ చేసి తాము తెచ్చుకున్న క్యాన్లలోకి డీజిల్‌ నింపుకుని వెళ్తున్నట్టు బాధిత డ్రైవర్లు చెబుతున్నారు. ఆయిల్‌ ట్యాంకర్‌కు సేఫ్టీ కోసం లాక్‌లు ఉంటాయి. దీతో దొంగలు కింద ఉన్న పైపును కట్‌ చేస్తున్నారు. కొన్నిసార్లు ట్యాంకర్‌లో ఎక్కువగా డీజిల్‌ ఉంటే చోరులు తెచ్చుకున్న క్యాన్లు నిండగానే అలాగే వదిలేసి వెళ్తారు. దీంతో ట్యాంకులోని డీజిల్‌ రోడ్డుపై వృథాగా పోతోంది. సేకరించుకున్న డీజిల్‌ క్యాన్లను వారు తెచ్చుకున్న ఆటోలో వేసుకుని వెళ్లిపోతున్నారు. ఇలా రోజుకు వందలాది లీటర్ల డీజిల్‌ చోరీ తరచూ జరుగుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. గతంలో బంగారుపాళెం ప్రాంతంలోని హైవేలో ఇలాంటి డీజిల్‌ చోరీలు ఎక్కువగా జరిగేవి. ఇప్పుడు దొంగలు నాగమంగళం వద్ద ఆపి ఉన్న లారీలను టార్గెట్‌ చేస్తున్నారు. హైవేలో పట్రోలింగ్‌ వాహనం వస్తున్నప్పటికీ అర్ధరాత్రి నుంచి మూడు గంటల ప్రాంతంలో ఎలాంటి పహారా ఉండదు. దీనికితోడు మంచి నిద్ర పొద్దు కావడంతో దొంగలు ఇదే సమయంలో చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. హైవే పోలీసులు నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పొద్దస్తమానం లారీ నడిపి రాత్రిపూట హైవే పక్కన బండిని ఆపి విశ్రాంతి తీసుకుందామనుకునే డ్రైవర్లకు కొందరు దొంగలు నిద్ర లేకుండా చేస్తున్నారు అర్ధరాత్రి దాటాక లారీలోకి వెళ్లి ట్యాంకర్‌ వైర్‌ కట్‌ చేసి క్యాన్లలో డీజిల్‌ పట్టుకుని వెళ్లిపోతున్నారు. డ్రైవర్లు పొద్దున లేచి చూసేసరికి లారీలో డీజిల్‌ మాయమవుతోంది. జరిగిన విషయం యజమానులకు చెబితే వారు తిట్లదండకం అందుకుంటారు. అయితే కొందరు చేయి తిరిగిన ఆయిల్‌ దొంగలు హైవేల్లోని లారీలను టార్గెట్‌ చేసి డీజిల్‌ కాజేస్తున్నారు. ఇటీవల పలమనేరు సమీపంలోని నాగమంగళం వద్ద ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
రహదారుల పక్కన ఆపిన లారీల్లో అర్ధరాత్రి దాటాక డీజిల్‌ మా1
1/1

రహదారుల పక్కన ఆపిన లారీల్లో అర్ధరాత్రి దాటాక డీజిల్‌ మా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement