అరసవల్లికి ధర్మ ప్రచార రథం
కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలోని ధర్మప్రచార రథం శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి బయలు దేరింది. అక్కడ వెలసిన సూర్యనారాయణస్వామి దేవస్థానంలో ఈనెల 4వ తేదీన జరిగే రథ సప్తమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. అలాగే ప్రముఖ ఆలయాలకు ఈ ప్రచారం రథం వెళ్లనున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు.
నేడు జిల్లాలో సామాజిక
పింఛన్ల పంపిణీ : కలెక్టర్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 1వ తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 1న జిల్లాలోని లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్‌లు పంపిణీ చేస్తారన్నారు. ఉదయం 6 గంటలకే పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో 2,66,491 మంది పింఛన్‌దారులకు రూ.113.20 కోట్లు ఫిబ్రవరి నెల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరబాట్లు తలెత్తకుండా పింఛన్లు పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
నేడు 108 ఉద్యోగుల మహాసభ
చిత్తూరు రూరల్(కాణిపాకం) : చిత్తూరు నగరంలోని రెవెన్యూ ఎంప్లాయిస్ భవనంలో శనివారం 108 ఉద్యోగుల సంఘ మహాసభను నిర్వహిస్తున్నట్లు 108 జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు సభ జరుగుతుందన్నారు. ఈ సభలో నూతన కమిటీని ఎన్నుకోనున్నామని, సభను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
నేటి నుంచి రేషన్ పంపిణీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి రేషన్ పంపిణీ చేయనున్నట్లు డీఎస్‌ఓ శంకరన్ తెలిపారు. మొత్తం 1,339 చౌక దుకాణల పరిధిలోని 5,31,019 కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు అందించనున్నారన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం జిల్లాకు 15 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 3 వేల మెట్రిక్ టన్నుల చక్కెర, 5 టన్నుల కందిపప్పు అందించినట్లు పేర్కొన్నారు.
జిల్లా అధికారుల
క్షేత్రస్థాయి పరిశీలన
పులిచెర్ల(కల్లూరు) : పులిచెర్ల మండలంలోని మంగళంపేట వద్ద ఉన్న భూములతో పాటు అటవీ ప్రాంత భూములను పెద్దిరెడ్డి కుటుంబికుల పేర కబ్జా చేసి అందులో రోడ్డు వేశారని మూడు రోజుల కిందట ‘ఓ పత్రికలో కథనం ప్రచురితం అయింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని మంగళంపేట సమీప భూములను క్షేత్ర స్థాయిలో జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం అక్కడ వేసిన సిమెంట్ రోడ్డు పనులను 2.2 కిలోమీటర్లు పరిశీలించారు.ఆ సమయంలో ఇతరులను ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు. మిగిలిన ఇతర పనులను పరిశీలిస్తామని అధికారుల చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఎఫ్‌ఓ భరణి, ఆర్‌డీఓ శ్రీనివాసులు, ఎఫ్‌ఆర్‌ఓ థామస్ సుకుమార్, జిల్లా సర్వేయర్ గిరి, తహసీల్దారు జయసింహ, ఎస్‌ఐ వెంకటేశ్వరులు పాల్గొన్నారు.
కుప్పం విద్యార్థి ప్రతిభ
– జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి
కుప్పంరూరల్ : కుప్పం పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ అభ్యసిస్తున్న శివశంకర్ జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జగన్నాథరావు తెలిపారు.76వ గణతంత్ర వేడుకల సందర్భంగా పంజాబ్ రాష్ట్రం మొహాలీ యూనివర్శిటీ, ‘ప్లక్షా యూనివర్శిటీ’ నిర్వహించిన ‘యంగ్ క్రియేటర్స్ లీగ్’లో శివశంకర్ ప్రదర్శించిన ‘ఇన్నోవేటివ్ వీల్‌చైర్ డిజయిన్డ్ ఫర్ లింబ్ ఇంపెయిర్డ్ యూజర్స్’ శకటానికి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి లభించింది. శుక్రవారం నిర్వహించిన ఫైనల్లో శివశంకర్ మొదటి బహుమతి సాధించి రూ.25 వేల నగదు పురస్కారం అందుకున్నట్లు ప్రిన్సిపల్ జగన్నాథరావు తెలిపారు. ఈ సందర్భంగా విజేతకు అధ్యాపకులు సుబ్బన్న, రమేష్, కృష్ణారావు, శ్రీనివాసులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment