
న్యూఢిల్లీ: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడు. కేవలం 23 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సికర్లు బాదాడు. పృథ్వీ షా ఇచ్చిన మెరుపు ఆరంభంతో ఢిల్లీ జట్టుకు భారీ స్కోరు చేయగలిగే అవకాశం లభించింది. ఐతే గత రెండు మ్యాచుల్లో చూసుకుంటే అతడి బ్యాటింగ్ వైఖరిలో కొంత మార్పు కనపించింది. ఈ విషయమై ఇంగ్లాడ్ క్రికెటర్ కెవిన్ పీటర్స్‌సెన్ కమెంట్రీ చేస్తూ ఢిల్లీ టీమ్ కోచ్ రికీ పాంటింగ్ను పృథ్వీ షా బ్యాటింగ్ గురించి అడిగాడు. అతడు మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మెన్ అని.. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడుతున్నాడని పాంటింగ్ మెచ్చుకున్నాడు. గత రెండేళ్లుగా పృథ్వీ తన బ్యాటింగ్ స్కిల్స్‌ను అనలైస్ చేసుకున్నాడని, ఎక్కువగా ఆఫ్ సైడ్ షాట్లు ఆడుతున్నాడని పాంటింగ్ అన్నాడు.
'ఒక కోచ్‌గా నేను అతడితో కొన్నిసార్లు మాట్లాడాను. అతడి బ్యాటింగ్ టెక్నిక్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాడు. అలాంటి ప్లేయర్‌కు ఎక్కువగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇలాంటి ఫార్మాట్‌లో వారి ఆటను ఆడనివ్వాలి. పృథ్వీ మంచి టచ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మా జట్టులో ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు' పాంటింగ్ పేర్కొన్నారు.