సాక్షి, వరంగల్: తెలుగు రాష్ట్రల్లో వేరు వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 9 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వైఎస్సార్ జిల్లా తాడిపత్రిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురుకికి గాయాలవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అదే విధంగా అన్నమయ్య జిల్లా సందేపల్లి మండలంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
ఇక వరంగల్ జిల్లాలో రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా గుర్తించారు. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురులో ఒకరు అల్లిపురానికి చెందిన ఆటో డ్రైవర్ సింగారపు బబ్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో.. హంటర్ రోడ్‌లోని ఫ్లైఓవర్‌పై ఖమ్మం నుంచి వరంగల్ వస్తున్న కారు, వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న మరో కారు ఢీ కొన్నాయి. ఇందులో ఖమ్మం నుంచి వస్తున కారు ఫ్లైఓవర్ నుంచి కింద పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరో కారులో నలుగురు ఉండగా వారికి ఎలాంటి గాయాలవ్వలేదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడు గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment