మృతురాలి ఇంటి వద్ద గూమికూడిన ప్రజలు
సాక్షి,నిడమనూరు(నల్గొండ): ఉదయం 8:30 గంటల ప్రాంతం.. ఇంట్లోని వారంతా తలా ఒక పని చేసుకుంటున్నారు.. ఇంతలోనే ముగ్గురు వ్యక్తులు కత్తులు, కారం డబ్బాలతో ఒక్కసారిగా ఇంటిపై దాడి చేశారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కళ్లలో కారం చల్లి.. కత్తులతో పొడుస్తూ వీరంగం సృష్టించారు.. కళ్లు మూసి తెరిచేలోపల వృద్ధురాలి ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇదేదో సినిమాలోని సీన్ కాదు.. నిడమనూరు మండలం బొక్కమంతులపాడ్‌లో రాయలసీమ ఫ్యాక్షన్‌ను తలపించేలా ఓ కుటుంబంపై మంగళవారం జరిగిన దాడి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతులపాడ్ గ్రామానికి చెందిన కమతం భిక్షమయ్య, అచ్చమ్మ(60) దంపతుల కుమారుడు శివనారాయణకు అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ, యశోద దంపతుల కూతురు శ్యామలతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివనారాయణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరోనా కాలంలో ఐటీ రంగం దెబ్బతినడంతో రెండేళ్లుగా గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు.
తరచూ గొడవలే..
శివనారాయణ, శ్యామల దంపతులకు మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో తరచూ శ్యామల పుట్టింటి వారు జోక్యం చేసుకుంటుండడంతో వివా దం పెద్ద మనుషుల వద్దకు చేరింది. పలుమార్లు పంచాయితీలు జరిగినా దంపతుల మధ్య గొడవలు ఆగడం లేదు. దీంతో శివనారాయణ భార్యను పుట్టింటికి వెళ్లనీయడం లేదు. ఫలితంగా రెండు కుటుంబాల మధ్య కక్షలు పెరిగిపోయాయి.
దాడి చేసి.. ప్రాణం తీసి..
రెండు కుటుంబాల మధ్య నెలకొన్న వివాదాలు తారస్థాయికి చేరాయి. ఒకే వీధిలో ఉంటున్న సూర్యనారాయణ, యశోద దంపతులు కుమారు డు శివతో కలిసి ఉదయం వియ్యంకుడు భిక్షమయ్య ఇంటిపై కత్తులతో దాడి చేశారు. ఒక్కసారిగా అరుచుకుంటూ వచ్చిన వారు తొలుత కళ్లలో కారం చల్లి, కత్తులతో కమతం అచ్చమ్మ గుండె, వీపు భాగంలో పొడిచారు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
అనంతరం భోజనం చేస్తున్న భిక్షమయ్యపై దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లుతూ కత్తులతో విచక్షణారహితంగా పొడుస్తూ వీరంగం సృష్టించారు. శివనారాయణపై దాడి చేయగా అతడి భార్య శ్యామల అడ్డువచ్చింది. అనంతరం అచ్చమ్మ తల్లి నారాయణమ్మపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలో వీరి అరుపులు, కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకోగానే వారు పారిపోయారు. దాడిలో గాయపడిన భిక్షమయ్య, నారాయణమ్మ, శివనారాయణను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
సమాచారం మేరకు సాగర్ సీఐ గౌరీనాయుడు, ఎస్‌ఐ సైదులు ఘటన స్థలాన్ని పరి శీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుడు శివనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, దాడి చేసిన నిందితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment