రాష్ట్రవ్యాప్తంగా శిలాఫలకాలపై టీడీపీ శ్రేణుల దాడులు
పలుచోట్ల ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం
ద్వారకాతిరుమల/తాడేపల్లిగూడెం/గోపాలపురం: అధికారమే అండగా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా శిలాఫలకాలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. పలు ప్రాంతాల్లో గురువారం కూడా యథేచ్ఛగా విధ్వంసం సాగించారు.
ఏలూరు జిల్లాలో సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసం
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. అంతేకాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం కిటికీ అద్దాలను పగులగొట్టాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఏమిటని గ్రామస్తులు మండిపడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోనూ..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 14వ వార్డు సత్యనారాయణపేటలో టీడీపీ కార్యకర్తలు సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సత్యనారాయణ పేటలో రెండేళ్ల క్రితం రూ.9 లక్షల నిధులతో సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మించారు. తాజాగా ఈ శిలాఫలకాన్ని నాశనం చేశారు.
‘తూర్పు’లో శిలాఫలకం పగులకొట్టి..
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు సచివాలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పగులకొట్టారు. అంతేకాకుండా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన వెంకటాయపాలెం – గౌరీపట్నం రోడ్డు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి తుప్పల్లో పడేశారు. దీంతో వెంకటాయపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పికెట్ ఏర్పాటు చేశామని ఎస్సై సతీష్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment