సాక్షి ప్రతినిధి, గుంటూరు/జరుగుమల్లి (సింగరాయకొండ)/జగదాంబ (విశాఖ దక్షిణ)/పమిడిముక్కల/రేణిగుంట: ప్రజలకు సేవలందిస్తున్న తమ వ్యవస్థపై విషం చిమ్మడం సరికాదన్న వలంటీర్లపై జనసేన, టీడీపీ నేతలు కూడబలుక్కుని దౌర్జన్యానికి తెగబడుతున్నారు. అకారణంగా దూషిస్తూ దాడులకు దిగుతున్నారు. గుంటూరులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఒక మహిళా వలంటీర్‌ను మూడు గంటల సేపు నిర్బంధించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు అందరి ఇళ్లను మ్యాపింగ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం రింగ్ రోడ్డులోని యరపతినేని ఇంటికి వలంటీర్ వెళ్లింది. పథకాలు ఏమీ రాకపోయినా మ్యాపింగ్ చేయాల్సి ఉందని చెప్పడంతో యరపతినేని భార్య అంగీకరించి ఫింగర్ ప్రింట్ కూడా వేసింది. తర్వాత వలంటీర్ కిందకి వచ్చి బండి బయటకు తీస్తున్న సమయంలో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వచ్చి మేడం పిలుస్తున్నారని చెప్పడంతో మళ్లీ పైకి వెళ్లింది.
యరపతినేని ఇంట్లో ఉన్న అతని బావమరిది వలంటీర్‌తో వాగ్వాదానికి దిగి ఆమెను నిర్బంధించారు. మా ఇంటికి ఎందుకు వచ్చారు. మా ఓట్లు తీసివేయడానికా, మా ఆస్తులు రాయించుకోవడానికా.. అంటూ నిలదీశారు. యరపతినేని శ్రీనివాసరావు కూడా ఫోన్‌లో వలంటీర్‌ను బెదిరించారు. దీంతో ఆమె సచివాలయం ప్లానింగ్ సెక్రటరీకి ఫోన్ చేయగా అతను, మరో ఉద్యోగి కలిసి వచ్చారు. వారితో కూడా వాగ్వాదం చేశారు. రాత్రి 9–15కు టీవీ–5 కెమెరామెన్ వచ్చి విజువల్స్ తీసుకున్న తర్వాత వారిని వదిలిపెట్టారు.
మట్టి తొలగించమని చెప్పడమే పాపమైంది..
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పీరాపురంలో టీడీపీ నేత ఎల్లావుల వెంకటేశ్వర్లు ఇల్లు మరమ్మతు చేసుకుంటూ వలంటీర్ బండి శ్రీనివాసులరెడ్డికి చెందిన స్థలంలో మట్టిని తెచ్చి పోశాడు. తమ స్థలంలో మట్టి ఎందుకు పోస్తున్నావని వలంటీర్ ప్రశ్నించాడు. ‘ఇది నీ స్థలం కాదు.. నా స్థలం’ అని ఎదురుదాడికి దిగడంతో వలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో టీడీపీ నేత వెంకటేశ్వర్లు, మరో 10 మంది రాడ్డు, కర్రలతో వచ్చి.. వలంటీర్ శ్రీనివాసులరెడ్డి, అతని తండ్రి వెంకటేశ్వర్లు, బాబాయి రమణయ్యపై దాడి చేశారు. రమణయ్య తలకు తీవ్ర గాయమైంది. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
పవన్‌ను ఏమైనా అంటే ఊరుకోం..
విశాఖలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, వలంటీర్లపై జన సైనికులు దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహిళా పోలీసులపై పాలు చల్లి రచ్చ చేశారు. వలంటీర్లపై పవన్‌కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ఆధ్యర్యంలో వలంటీర్లు పూర్ణామార్కెట్ జంక్షన్‌లో ఆందోళన చేపట్టారు.
పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సమయంలో జనసేన సైనికులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. పవన్‌ను ఏమైనా అంటే ఊరుకోం అంటూ రెచ్చిపోయారు. అంటుకున్న దిష్టిబొమ్మను వీరిపై వేశారు. దీంతో కండిపిల్లి వరలక్ష్మి అనే మహిళ చీరకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మంటలు ఆర్పివేయంతో ప్రమాదం తప్పింది. 14 మంది జన సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంపేసి శ్మశానంలో పాతిపెడతాం..
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన జనసేన కార్యకర్త కె.ప్రవీణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్, పామర్రు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కంభపు రాంబాబుకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్‌పై ఎందుకు విమర్శలు చేశావంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో రాంబాబు తాను పోలీసులకు చెబుతానని ఫోన్ కట్ చేశాడు. మరో నాలుగైదుసార్లు ఫోన్ చేసినా అలాగే కట్ చేశాడు.
రాత్రి ప్రవీణ్‌కుమార్ మరో ముగ్గురు జనసేన కార్యకర్తలతో కలిసి అతని ఇంటికెళ్లి రాంబాబు ఎక్కడ అని ప్రశ్నించారు. ఇంట్లో లేరని చెప్పిన అతడి భార్యను దుర్భాషలాడుతూ భయానక వాతావరణం సృష్టించారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తే రాంబాబును చంపేసి శ్మశానంలో పాతిపెట్టి చెప్పులదండ వేస్తామని హెచ్చరించారు. కుటుంబంలో అందరినీ చంపేస్తామని భ్రయభ్రాంతులకు గురి చేశారు. రాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళా సీఐని దుర్భాషలాడిన జనసేన నేత
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన నాయకురాలు నగరం వినుత ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పది తలల రావణుడంటూ దిష్టిబొమ్మను తయారు చేసి అనుచితంగా కాలితో తన్నడంతో పాటు కాల్చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి ఆందోళనలకు అనుమతి లేదంటూ శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ అంజూయాదవ్, బుచ్చినాయుడు కండ్రిగ సీఐ విక్రమ్ సిబ్బందితో అడ్డుకున్నారు.
ఈ క్రమంలో జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ కొట్టేటి సాయి సుమారు 15 మంది కార్యకర్తలతో కలసి ఉన్నపళంగా పెళ్లిమండపం వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను కింద పడవేసి కాలితో తొక్కుతూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జై.. పవన్ కల్యాణ్ అంటూ కేకలు పెట్టారు. అక్కడికి చేరుకున్న సీఐలు అంజూయాదవ్, విక్రమ్ సిబ్బందితో కలసి జనసేన కార్యకర్తలను వారించబోయారు.
దిష్టిబొమ్మకు సాయి నిప్పంటిస్తుండగా సీఐ అడ్డుకున్నారు. దీంతో అతను సీఐని పరుష పదజాలంతో దుర్భాషలాడుతూ తిరగబడ్డాడు. అమెను బలంగా నెట్టడంతో సీఐ అంజూయాదవ్ సాయి చెంపపై కొట్టారు. నలుగురిపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, నగరం వినుత, ఆమె భర్త కోట చంద్రబాబుపై కూడా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment