ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: కోవిడ్ విజృంభిస్తోన్న వేళ ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి సేవలు అందిస్తున్నారు. ఈ తరుణంలో వారి పట్ల కృతజ్ఞత చూపకపోయిన పర్వాలేదు కానీ అవమానించడం సమంజసం కాదు. కానీ చాలా చోట్ల జనాలు తమ చుట్ట పక్కల నివాసం ఉండే వైద్య సిబ్బందిని అవమానిస్తూ.. వారిపై దాడులకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది.
తమ ఇంటి పక్కన ఉండే నర్సింగ్ విద్యార్థిని వల్ల తమకు వైరస్ సోకిందని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులు ఆమెపై కత్తితో దాడి చేశారు. అంతటితో ఆగక ఆమె తండ్రిని బూతులు తిడుతూ.. అవమానించారు. ఆ వివరాలు.. బెంగళూరు ఇందిరానగర్ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన ప్రియదర్శి(20) నర్స్ ట్రైనింగ్ చేస్తుంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆమె తల్లి కోవిడ్ బారిన పడింది. ఆ తర్వాత వారి ఇంటి పక్కన నివాసం ఉండే ప్రభుకి గత నెలలో కోవిడ్ సోకింది.
ఈ క్రమంలో ప్రభు, ప్రియదర్శి వల్లే తాను కోవిడ్ బారిన పడ్డానని ఆరోపించసాగాడు. ఆమె కుటుంబం వల్లనే తనకు కరోనా సోకిందని ఆరోపిస్తూ.. మూడు రోజుల క్రితం ప్రియదర్శి తండ్రితో గొడవకు దిగాడు. ఆ సమయంలో ప్రభు సోదరులు ఇద్దరు అతడితో కలిసి బాధితురాలి తండ్రిని బూతులు తిడుతూ.. అవమానించసాగారు. ఈ క్రమంలో ప్రియదర్శి వారిని వారించడం కోస ప్రయత్నించగా.. ప్రభు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రియదర్శి చెయ్యి తెగింది. దాంతో ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లింది.
ఈ సందర్భంగా ప్రియదర్శి సోదరి సప్న మాట్లాడుతూ.. ‘‘ప్రభుకి కరోనా సోకిన నాటి నుంచి మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. మాపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారు’’ అని తెలిపింది. ప్రియదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రభు, అతడి సోదరుల మీద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment