రాయగడ: ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న వారంతా హాహాకారాలు చేస్తూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కిందికి దిగి ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక హలువ గ్రామానికి సమీపంలో గల తరణి మందిరం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటలకు ప్రయాణికులతో వస్తున్న ఒక ప్రైవేట్ బస్సులో అగ్నికీలలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులకు సంబంధించిన లగేజీ పూర్తిగా కాలిబూడిదైంది.
అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా కొశాగుమడ నుంచి గంజాం జిల్లాలోని పొలసరకు వెళ్తున్న బొర్షా పేరుగల ప్రైవేట్ బస్సు 42 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొశాగుమడలో బయలు దేరింది. రాయగడకు చేరేందుకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉండగా హలువా గ్రామానికి దగ్గర గల తరణి మందిరం వద్ద అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
ప్రయాణికులు హెచ్చరించినా..
కొశాగుముడ నుంచి బయలు దేరిన బస్సు రాయగడకు సుమారు 43 కిలోమీటర్ల దూరంలో గల కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ చేరేసరికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలైంది. అప్పటికే బస్సు వెనుక నుంచి ఏదో కాలుతున్న వాసన వస్తోందని ప్రయాణికులు డ్రైవర్‌కు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా బస్సును పోనిచ్చాడు. దీంతో తరణి మందిరం వద్దకు చేరేసరికరి బస్సు వెనుక టైరు పేలిపోయింది. అనంతరం మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణభయంతో బయటకు వచ్చేశారు. ఇంతలో బస్సులో మంటలు ఎక్కువ కావడంలో ప్రయాణికులు వారి లగేజీ తీయలేకపోయినా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బస్సు నుంచి బయట పడ్డారు.
సంఘటన జరిగిన తరువాత డ్రైవర్ పరారయ్యాడు. చుట్టుపక్కల గల గ్రామస్తులు చేరుకుని విషయాన్ని ప్రమాద విషయమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అరగంట తరువాత సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు అందులొ గల ప్రయాణీకుల సామాన్లు,లగేజీలు కాలిబూడిదయ్యాయి. అనంతరం పొలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో వాహనంలో రాయగడకు తరలించారు. పొలీసులు కేసు నమెదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment