సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసులో మళ్లీ కదలిక మొదలైంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అడ్డుపెట్టుకొని 15 ఏళ్లుగా విచారణ నుంచి తప్పించుకున్న చంద్రబాబుకు ఇకపై ఆ అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన బాబు పెద్ద ఎత్తున అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ దివంగత ఎన్.టి.రామారావు సతీమణి లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన పిటిషన్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో త్వరలో రోజువారీ పద్దతిన విచారణకు రానుంది. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులపై సత్వర విచారణ చేపట్టాలంటూ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 21 నుంచి ఈ కేసు విచారణ ఊపందుకోనుంది.
2005 నుంచి తప్పించుకుంటూ..
తనపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభం అవుతూనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ మధ్యంతర ఉత్తర్వులను సాకుగా చూపడంతో దాదాపు 15 ఏళ్లుగా విచారణ నిలిచిపోయింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల స్టేల గడువు ఆరు నెలలకు మించి ఉండడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణను పునఃప్రారంభించింది. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో ఫిర్యాదిగా ఉన్న లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని కోర్టు త్వరలో నమోదు చేయనుంది. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 21కు వాయిదా వేశారు.
ఓటుకు కోట్లు కేసూ..: ‘ఓటుకు కోట్లు’ కేసు విచారణ కూడా మళ్లీ ఊపందుకోనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి తమ అభ్యర్థి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టి ఓటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డితోపాటు పలువురు నిందితులుగా ఉన్నారు. ఈ కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు శుక్రవారం విచారించి సోమవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసు కూడా సోమవారం నుంచి రోజువారీ పద్దతిలో జరిగే అవకాశం ఉంది.
రోజువారీ విచారణకు బాబు అక్రమాస్తుల కేసు
Published Sat, Oct 10 2020 2:57 AM | Last Updated on Sat, Oct 10 2020 6:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment