సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు చెందిన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని ఆ పిటిషన్‌లో కోరింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన రూ.330 కోట్ల ఫైబర్‌నెట్ మొదటి దశ ప్రాజెక్ట్ కాంట్రాక్టును అప్పటి సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా తన సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కేటాయించారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ ఏ–1గా వేమూరి హరికృష్ణ, ఏ–11గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ–25గా చంద్రబాబును పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు ఈ కేసులోని నిందితులకు ఏపీ, తెలంగాణలో ఉన్న ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదనను రాష్ట్ర హోం శాఖ ఆమోదిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాటి అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతి వచ్చిన తర్వాత ఆ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ చర్యలు చేపట్టనుంది.
ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తులు..
- నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల ఇంటి స్థలం, ఆయన డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్‌లో ఉన్న ఓ ఫ్లాట్.
- మరో నిందితుడు టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్‌లు, యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్, ఆయన భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి.
Comments
Please login to add a commentAdd a comment