సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వెబ్‌సైట్స్ ముసుగులో కలర్ ప్రిడిక్షన్ గేమ్ పేరుతో భారీ బెట్టింగ్ దందాకు పాల్పడిన చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ.. డైరెక్టర్ల ఎంపికలోనూ పథకం ప్రకారం వ్యవహరించింది. తమకు అనుబంధంగా ఏర్పడిన కంపెనీల్లో డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుంది. నగర సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నీరజ్ తులీ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజింగ్ టీ పవర్ సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్‌గా వ్యవహరించిన యాన్ హో ఢిల్లీకి చెందిన హేమంత్‌ను ఆడిటర్‌గా నియమించుకున్నాడు. అయితే ఎక్కడా అధికారికంగా రికార్డుల్లో దీన్ని పొందుపరచలేదు. ఇతడి సహకారంతోనే ఢిల్లీలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో పలు సంస్థల్ని రిజిస్టర్ చేయించాడు. వీటిలో 90 శాతం మంది చైనీయులు డైరెక్టర్లుగా ఉండగా.. పది శాతం మంది మాత్రం ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.
(చదవండి: కలర్ ప్రిడెక్షన్.. మనీ లాండరింగ్!)
కిరాణ దుకాణం నిర్వాహకుడూ డైరెక్టరే..
ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతానికి చెందిన చిన్న కిరాణ దుకాణం నిర్వాహకుడు నీరజ్ తులీ ఓ నాలుగు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ విషయం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లి పట్టుకునే వరకు అతడికే తెలీదు. కలర్ ప్రిడిక్షన్ గేమింగ్ యాప్ గుట్టురట్టు చేసిన అధికారులు యాన్ హో, ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్‌లతో పాటు ఇతడినీ అదుపులోకి తీసుకోవడంతో షాక్‌కు గురయ్యాడు. కలర్ ప్రిడిక్షన్ ఏమిటో, ఆ చైనా సంస్థ ఏమిటో, బీజింగ్ టి పవర్ కంపెనీ ఏమిటో... తనకు తెలియదంటూ లబోదిబోమన్నాడు. తన ఇంటికి సమీపంలో ఉండే హేమంత్ అనే చార్టెడ్ అకౌంటెంట్ తనకు ఆడిటింగ్ చేస్తుండేవాడని చెప్పాడు.
గతంలో ఆడిటింగ్‌కు అవసరం అంటూ కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నాడని, నో యువర్ కస్టమర్ (కేవైసీ) దాఖలు చేయాలంటూ గుర్తింపు పత్రాలు తీసుకువెళ్లాడని వెల్లడించాడు. వీటి ఆధారంగా నాలుగు కంపెనీల్లో తులీని డైరెక్టర్‌గా చేసిన హేమంత్ తన ఫోన్ నంబర్, ఈ–మెయిల్ అడ్రస్‌లు అందులో పొందుపరిచాడు. తులీ పేరుతో ఇతడే ఆయా కంపెనీల కార్యకలాపాలు సాగించేవాడని తేలింది. ఇలానే మరికొందరు డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుని, చైనీయులకు అనుకూలంగా బోర్డు తీర్మానాలు చేసినట్లు అధికారులు అనుమానిస్తూ ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. తులీతోపాటు మరో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు తులీకి సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.
పరారీలో ప్రధాన నిందితుడు హేమంత్...
యాన్ హో తదితరులు అరెస్టుతో అప్రమత్తమైన హేమంత్ కరోల్‌బాగ్‌లోని అతడి ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసు వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లతోపాటు సీబీఐ, కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు నగర పోలీసులు అందించారు. ఆయా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న చైనీయులపై అన్ని విమానాశ్రయాలకు లుక్‌ఔట్ సర్క్యులర్లు జారీ చేయాలని నిర్ణయించారు. తదుపరి విచారణ కోసం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
(ఈ గేమ్ ఆడితే ‘రంగు’ పడుద్ది!)
Comments
Please login to add a commentAdd a comment