హిమాయత్‌నగర్: తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ యువకుడు తన మాజీ భార్య, ఆమె భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పది నెలల చిన్నారి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి నారాయణగూడ ఎక్స్‌రోడ్ సమీపంలోని జీహెచ్‌ఎంసీ మార్కెట్‌వద్ద చోటు చేసుకుంది’. డయల్–100 ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నారాయణగూడ పోలీసులు స్థానికుల సాయంతో బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం క్లూస్‌టీం వివరాలు సేకరించింది.
పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అంబర్‌పేటకు చెందిన నాగుల సాయి, చిక్కడపల్లి మునిసిపల్ మార్కె ట్ ప్రాంతానికి చెందిన ఆర్తీ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. నాగుల సాయి బ్యాండ్ కొట్టే పనిచేస్తుండగా ఆర్తీ నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో పూలు విక్రయించేది. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో రెండేళ్ల క్రితం ఆర్తీ అతడి నుంచి విడిపోయి తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్‌లతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లికి చెందిన ట్యాంక్ క్లీనర్ నాగరాజుతో పరిచయం ఏర్పడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తనని వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆర్తిని, ఆమె వివాహం చేసుకున్న నాగరాజు, అన్ని విషయాల్లో తనకు అడ్డుపడుతున్న ఆర్తి సోదరుడు జితేందర్‌ను అంతమొందించేందుకు నాగుల సాయి రెండేళ్ల క్రితమే కుట్ర పన్నాడు. భార్యను అంతమొందించేందుకు ఆమె వద్దకు వెళ్లగా జితేందర్ అడ్డుకున్నాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో జితేందర్‌పై నాగుల సాయి దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు నాగుల సాయిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏడాది క్రితం మరోసారి నారాయణగూడ పరిధిలో నాగులసాయిపై కేసు నమోదైంది. దీంతో వారిపై కక్ష పెంచుకున్న నాగుల సాయి ఈసారి పక్కాగా హత్య చేయాలని కుట్ర పన్నాడు.
ఇందులో భాగంగా సోమవారం రాత్రి జగ్గులో పెట్రోల్ తీసుకువచ్చి ఆర్తీ, భర్త నాగరాజులపై చల్లి నిప్పటించాడు. ఆ పెట్రోల్ ఆర్తీ ఒడిలో ఉన్న చంటిపిల్లాడు విష్ణుపై (10 నెలలు) కూడా పడింది. దీంతో ముగ్గురూ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఆర్తీ, నాగరాజులకు 50శాతం గాయాలవ్వగా..90 శాతం గాయపడిన చిన్నారి విష్ణును గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు నాగుల సాయి కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
(చదవండి: జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి..)
Comments
Please login to add a commentAdd a comment