సాక్షి, హైదరాబాద్: మాదక ద్రవ్యాల సరఫరాదారులు రూటు మార్చారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకు గోవా, బెంగళూరు, ముంబైల నుంచి కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను నగరానికి తీసుకొచ్చి.. స్థానిక విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సెలబ్రిటీలకు విక్రయించేవాళ్లు. తాజాగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. వెస్ట్ బెంగాల్ నుంచి హెరాయిన్‌ను, పంజాబ్ నుంచి పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్ డ్రగ్స్‌ను నగరానికి తీసుకొస్తూ.. రాచకొండ పోలీసులకు చిక్కడమే ఇందుకు ఉదాహరణ.
అక్రమ మార్గాలను ఎంచుకుని..
- హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల వాళ్లు పని చేస్తుంటారు. వలస వచ్చిన వీరిలో కొంతమంది డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో విరివిగా దొరికే కొకైన్, హెరాయిన్ డ్రగ్స్‌లను హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నగరంలో డ్రగ్స్ డిమాండ్‌ను గుర్తించి క్యాష్ చేసుకునేందుకు ఇలా చేస్తున్నారు.
- ఆయా రాష్ట్రాలలో గ్రాము రూ.300 చొప్పున కొనుగోలు చేసి లారీలు, రైలు, బస్సులలో ప్రయాణించి నగరానికి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన దానిలో కొంత వారు వినియోగిస్తూనే.. మరికొంత డ్రగ్స్‌ను ఎక్కువ మొత్తానికి విక్రయిస్తున్నట్లు పలు కేసుల్లో పోలీసుల విచారణలో బయటపడింది.
- టోల్ ప్లాజాలు, పోలీస్ చెక్‌పోస్ట్‌లు లేని రూట్ల కోసం గూగుల్‌లో వెతికి మరీ రవాణా చేస్తున్నారని ఓ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. డ్రగ్స్ రవాణా సమయంలో పైలెట్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. వెనకాల డ్రగ్స్ వచ్చే వాహనానికి, పైలెట్ వెహికిల్‌కు మధ్య కనీసం 3– 5 కి.మీ. దూరం ఉంటుంది. పోలీసుల తనిఖీలను ఎప్పటికప్పుడు వెనకాల వాహనంలోని నిందితులకు చేరవేస్తుంటారు. ఏమాత్రం తేడా వచ్చినా వెంటనే వాహనాన్ని రూటు మారుస్తుంటారని ఆయన వివరించారు.
పట్టుబడిన నిందుతులు
- ఈ ఏడాది ఫిబ్రవరి 18న డ్రగ్ హెరాయిన్‌ను వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను మల్లాపూర్ క్రాస్ రోడ్స్‌లో స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) మల్కాజిగిరి, నాచారం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 16 గ్రాముల హెరాయిన్ (బ్రౌన్ షుగర్)ను స్వాధీనం చేసుకున్నారు.
- గత నెల 31న పాపి స్ట్రా కాన్సన్‌ట్రేట్ డ్రగ్‌ను పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇద్దరు నిందితులను కీసర– శామీర్‌పేట రోడ్‌లో ఎస్‌ఓటీ మల్కాజిగిరి, కీసర పోలీసులు పట్టుకున్నారు. 900 గ్రాముల పాపి స్ట్రాను స్వాధీనం చేసుకున్నారు.
(చదవండి: సరదాగా మొదలై... వ్యసనంగా మారి!)
Comments
Please login to add a commentAdd a comment