న్యూఢిల్లీ: ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. యువతితో పరిచయం, సహజీవనం, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా కోయడం, ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని భద్రపరిచిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. దీనికి తోడు హత్య చేసిన ఆరు నెలల తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి రావడం మరింత గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేసు వివరాలను ఢిల్లీ సౌత్ పోలీసు ఇన్‌ఛార్జ్ అంకిత్ చౌహాన్ తెలిపారు.
300 లీటర్ల ఫ్రిడ్జి కొని
24 ఏళ్ల యువతితో సహజీవనం చేసిన ప్రియుడు చివరికి ఆమె పాలిట మృత్యుపాశంగా మారాడు. ఉన్మాదిగా మారి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే ప్రియురాలిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అయిదు నెలల క్రితమే ప్రియురాలని హత్య చేసినట్లు తేలింది. యువతిని అంతమొందించి.. ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా కోశాడు. అయితే ఆమె శరీర భాగాలను భద్రపరిచేందుకు ఓ భారీ(300 లీటర్ల) ఫ్రిడ్జిని కొనుగోలు చేశాడు.
చదవండి: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
దుర్వాసన రాకుండా అగర్‌బత్తీలు
హత్య చేసిన 18 రోజుల్లో వాటిని ఒక్కొక్కటిగా నగరంలోని మొహహ్రౌలీ అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా విసిరేశాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయటకు వచ్చి ముక్కలుగానరికిన శరీర భాగాలను పారేశాడు. అపార్ట్‌మెంట్ ఇరుగుపొరుగు వారికి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో అగర్‌బత్తిలు వెలిగించినట్లు అంగీకరించాడు. అంతేగాక అమెరికన్ క్రైం షో ‘డెక్స్టర్’ నుంచి ప్రేరణ పొంది ఇంతటి కిరాతకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికితోడు చెఫ్‌గా శిక్షణ పొందిన నిందితుడు మాంసం కత్తిని ఉపయోగించడంలో ప్రవీణుడని తేలింది.
హత్యకు ముందు ఏం జరిగిందంటే
ముంబైలో పనిచేస్తుండగా అఫ్తాబ్ అనే 28 ఏళ్ల యువకుడు శ్రద్ధా(26) యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో యువతి వాళ్ల ఇంట్లో వీరి బంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఇద్దరు కలిసి ఢిల్లీకి మకాం మార్చారు. ఓ మల్టినేషనల్ కంపెనీకి చెందిన కాల్ సెంటర్‌లో పనిచేస్తూ ఛతర్‌పూర్‌లోని అపార్ఠ్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు. మే నెలలో ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు కాస్తా పెద్దగా అయ్యాయి. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా నిత్యం ఒత్తిడి తేవడంతో మే 18న ప్రియురాలిని అఫ్తాబ్ గొంతు కొసి చంపాడు.
ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో
కూతురు సహజీవనం విషయంలో విభేదాలు రావడంతో తల్లిదండడ్రులు ఆమెతో మాట్లాడటం మానేశారు. అయితే కొంతకాలంగా శ్రద్ధా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఆమె స్నేహితురాలు చెప్పడంతో అనుమానం వచ్చిన తండ్రి కూతురు కోసం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు హంతకుడిని ఐదు రోజుల కస్టడీకి తరలించారు. అటవీ ప్రాంతంలో కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నామని, అయితే అవి మానవ అవశేషాలు కాదా అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. నిందితుడు ఉపయోగించిన కత్తి ఇంకా లభ్యం కాలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment