న్యూఢిల్లీ: తనను ప్రేమించి మరో యువతిని ఎందుకు పెళ్లాడుతున్నావని నిలదీసినందుకు ప్రాణంతీశాడో దుర్మార్గుడు. చంపేసి ఊళ్లోని తన దాబాలో ఉన్న రిఫ్రిజరేటర్‌లో దాచాడు! రెండు, మూడు రోజుల క్రితం జరిగిన ఈ హత్యోదంతం ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) రోజే వెలుగు చూడటం గమనార్హం.
ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం నైరుతి ఢిల్లీలోని మిత్రోన్ గ్రామానికి చెందిన సాహిల్ గెహ్లాట్(24) గత కొన్ని సంవత్సరాలుగా హర్యానాకు చెందిన నిక్కీ యాదవ్ అనే యువతితో సహజీవనంలో ఉన్నాడు. 2018 జనవరిలో ఉత్తమ్ నగర్‌లోని ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో వీరికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు, తర్వాత సహజీవనానికి దారితీసింది. అప్పటి నుంచి సొంతూళ్లలో ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు. నిక్కీ సాహిల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది.
అయితే ఇటీవల గెహ్లాట్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం సాహిల్ ప్రియురాలికి చెప్పలేదు. అయితే ఎట్టకేలకు పెళ్లి విషయం తెలుసుకున్న నిక్కీ అతడిని నిలదీసింది. మరొకరిని పెళ్లాడితే వేరే కేసులో ఇరికిస్తానని బెదిరించింది. కాగా ఫిబ్రవరి 9వ తేదీన సాహిల్‌కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. దీంతో నిక్కీ అతనికి ఫోన్ చేసి ఉత్తమ్ నగర్‌లోని తన ఫ్లాట్‌కు రమ్మని చెప్పింది. నిందితుడు తన కారులో బాధితురాలి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆమెను కారులో బయటకు తీసుకొచ్చాడు.
అక్కడ కూడా పెళ్లి చేసుకోవద్దని ఆమె ఒత్తిడి చేసింది. అంతేగాక అదే ఫిబ్రవరి 9న ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లేందుకు ముందే ప్లాన్ చేసి టిక్కెట్లు బుక్ చేసుకుంది. తనతో పాటు గోవాకు రావాలని అడగ్గా.. సాహిల్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన గెహ్లాట్ కారులో మొబైల్ ఫోన్ డేటా కేబుల్‌తో అమ్మాయిని గొంతు నులిమి చంపేశాడు.
అనంతరం మృతదేహాన్ని కారులో తన దాబా దగ్గరకు తీసుకెళ్లాడు. దాబాలోని ఫ్రిజ్‌లో పెట్టి దానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. అదే రోజు(ఫిబ్రవరి 10 ఉదయం) వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నిందితుడు గెహ్లాట్‌ను ఢిల్లీ దగ్గర్లోని కయిర్ గ్రామంలో అరెస్ట్‌చేశామని పోలీస్ స్పెషల్ కమిషనర్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
మృతదేహం రిఫ్రిజిరేటర్ లోపల చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. నెమ్మదిగా కుళ్ళిపోవడం ప్రారంభించిందని, ఆమె శరీరంపై గొంతు నులిమిన గుర్తులు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడు కశ్మీర్ గేట్ సమీపంలో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య జరిగిన ప్రాంతాన్ని ఇంకా ధృవీకరించబడలేదు.
Comments
Please login to add a commentAdd a comment