బాత్‌రూమ్‌లో నిర్జీవంగా కొడుకుతో సహా భార్యా భర్తలు
సనత్‌నగర్(హైదరాబాద్): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్‌రూంలో నిర్జీవంగా పడి ఉండటం కలకలం రేపింది. మానసిక స్థితి సరిగా లేని కుమారుడికి స్నానం చేయించేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్ళిన భార్యభర్తలు.. కొడుకుతో సహా విగతజీవులుగా మారడం సంచలనం రేకె త్తించింది. అయితే వీరు విద్యుదాఘాతానికి గురయ్యారా? లేక కొడుకు మానసిక పరిస్థితి తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ? అనేది మిస్టరీగా మారింది.
సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జెక్‌కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా.. జెక్ కాలనీ నాల్గో వీధిలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ ఫ్లా్లట్ నంబర్ 204లో ఆర్.వెంకటేష్ (59), భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ (25) నివాసం ఉంటున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటేష్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని సిగ్నోడ్ ట్రాన్సిస్ట్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌లో బిజినెస్ యూనిట్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. 2004 నుంచి జెక్‌కాలనీలోనే నివాసముంటున్నారు.
కుమారుడు హరికృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో దగ్గరుండి తల్లిదండ్రులే అతని బాగోగులు చూసుకుంటున్నారు. ప్రతిరోజూ వారే కుమారుడికి స్నానం చేయిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ముగ్గురూ బాత్‌రూంలో మృత్యువాత పడగా, వారి మృతికి కారణం ఏమై ఉంటుందా? అన్నది మిస్టరీగానే ఉంది. బాత్‌రూమ్‌లో గ్యాస్ ఆధారిత గీజర్ ఉండటంతో షార్ట్ సర్క్యూట్‌కు ఆస్కారం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాత్‌రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడాన్ని బట్టి చూస్తే ముగ్గురూ ఒకేసారి బాత్‌రూమ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది.
ఇలా వెలుగులోకి వచ్చింది..
ఇంట్లో పనిచేసే వరలక్ష్మి ఉదయం 11.30 గంటలకు వచ్చి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ముగ్గురూ బయటకు వెళ్ళి ఉంటారేమోనని భావించి యధావిధిగా క్లీన్ చేసి వెళ్ళిపోయింది. బాత్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి లేకపోవడంతో అటువైపు ఆమె వెళ్లలేదు. తిరిగి సాయంత్రం 4 గంటలకు వరలక్ష్మి మళ్ళీ రాగా..పాల ప్యాకెట్, ఉదయం తాను చూసిన ఇతరత్రా వస్తువులు అలాగే ఉండడాన్ని చూసి ఇంకా వారు రాలేదేమోనని వెళ్లిపోయింది.
సాయంత్రం 6 గంటలకు తోటి పనిమనిషి విజయలక్ష్మితో కలిసి మళ్లీ వచ్చింది. అయితే అనుమానం వచ్చిన వారికి వాచ్‌మన్ సత్యనారాయణను పిలిచి బాత్‌రూమ్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించగా డోర్‌కు అడ్డంగా హరికృష్ణ బట్టలు లేకుండా పడిఉన్నాడు. ఆ పక్కనే వెంకటేష్, మాధవి మృతదేహాలు పడి ఉన్నాయి.
స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా క్లూస్ టీమ్‌తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment