
Hyderabad Fraud Shopping Website: బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్ పేజీలో కళ్ల జోడు యాడ్ వచ్చింది. దానిపై ప్రముఖ కంపెనీ పేరు ఉండటంతో పాటు క్లియరెన్స్ సేల్ అని కనిపించడంతో ఆయన ముందుకు వెళ్లారు. మార్కెట్‌లో కనీసం రూ.10 వేలు ఖరీదు చేసే చలువ కళ్లజోడు కేవలం రూ.2 వేలకే అంటూ అందులో ఉంది. ఆ మొత్తం ఫోన్ పే ద్వారా చెల్లించిన ఆయన కొన్ని రోజులకు మోసపోయినట్లు గుర్తించారు. ఇటీవల కాలంలో అనేకమంది ఇలాంటి ఆన్‌లైన్ ప్రకటనల బారినపడి మోసపోతున్నారు. నష్టపోయేది చిన్న మొత్తాలు కావడంతో పోలీసుల వరకు వెళ్లకుండా మిన్నకుండిపోతున్నారు. ఇదే మోసగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. నగరంలో ప్రతి రోజూ వందలాది మంది ఈ యాడ్స్ బారినపడుతున్నారని తెలుస్తోంది.
క్లియరెన్స్ సేల్ పేరుతో...
ఫేస్‌బుక్ సహా వివిధ సోషల్‌మీడియా సైట్ల ద్వారా నకిలీ కంపెనీలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కళ్లజోళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు, ఉడెన్ ఫర్నిచర్.. ఇలా అనేక ఉత్పత్తులకు సంబంధించి ఈ ప్రకటనలు కనిపిస్తున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్న ఆ ప్రకటనల్లో ఉత్పత్తుల ఫోటోలు అదే స్థాయిలో ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్‌లో దొరికే వాటి కంటే ఆకట్టుకునేలా, అతి తక్కువ రేటుతో కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సేల్స్, క్లియరెన్స్ సేల్ అంటూ మోసగాళ్లు పొందుపరుస్తున్నారు. వీటిని చూసిన ఎవరైనా తక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని అనుమానించట్లేదు.
‘పైన’ ఒకటి.. ‘అడ్రస్’ మరోటి..
► ఈ ప్రకటనలు సైతం చూసే వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉంటున్నాయి. సదరు వెబ్ పేజీ తెరిచిన వెంటనే పైన ప్రముఖ కంపెనీల పేర్లు దర్శనమిస్తున్నాయి. మోసగాళ్లు ఎక్కువగా ఈ–కామర్స్ రంగంలో పేరెన్నికగన్న కంపెనీల పేర్లు, లోగోలు వాడుతున్నారు.
► ఆయా సైట్లలో షాపింగ్ చేయడానికి పొందు పరచాల్సిన ఫోన్ నంబర్, చిరునామా తదితరాలకు సంబంధించిన అంశాలన్నీ ఈ పేజీలోనూ ఉంటున్నాయి. ఆ పేజీలకు సంబంధించిన అడ్రస్ బార్‌లో మాత్రం ఆయా కంపెనీ అడ్రస్‌లు ఉండట్లేదు.
► సాధారణంగా ప్రముఖ కంపెనీల నుంచి ఆన్‌లైన్‌లో ఖరీదు చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు, ఉత్పత్తులకు మినహాయిస్తే మిగిలిన వాటికి ఇది కచ్చితంగా కనిపిస్తుంటుంది.
► బోగస్ వెబ్‌సైట్లలో మాత్రం ఈ అవకాశం ఉండదు. ఖరీదు చేసే వాళ్లు కచ్చితంగా అప్పటికప్పుడే గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐలు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు చెల్లించిన తర్వాతే ఆర్డర్ ఖరారు అవుతోంది.
చదవండి: ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు..హైదరాబాద్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు
‘మార్కెటింగ్ ఇంటెలిజెన్స్’ ఏమైనట్లు?
► బాధితులు నష్టపోయేది తక్కువ మొత్తాలే కావడంతో కనీసం 5 శాతం మందీ పోలీసు వరకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. డబ్బు తిరిగి రాదు సరికదా ఠాణా చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు భావిస్తుండటమే దీనికి కారణం. సైబర్ స్పేస్‌లో జరిగే ఈ తరహా మోసాలను ముందుగానే కనిపెట్టాల్సిన అవసరం ఉంది
► నానాటికీ పెరిగిపోతున్న సైబర్ నేరాలు, కేసుల దర్యాప్తులో తలమునకలై ఉంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఈ విషయాలు పట్టించుకోవట్లేదు. ఫలితంగా మోసగాళ్లు అనునిత్యం అందినకాడికి దండుకుంటున్నారు.
► ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్‌లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు.
డబ్బు కట్టాక రివ్యూలు చూస్తే...
► డబ్బు చెల్లించిన వినియోగదారులకు కన్ఫర్మేషన్ ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లు రావట్లేదు. మరోసారి ఆ పేజ్‌లోకి వెళ్లి తనిఖీ చేయాలని ప్రయత్నిస్తే గతంలో లావాదేవీలు చేసిన పేరుతో కనిపించట్లేదు.
► కొన్నిసార్లు యూపీఐ విధానంలో డబ్బు చెల్లించిన తర్వాత ఆయా సైట్లలోనే ఏదో సాంకేతిక పొరపాటు జరిగింది. మళ్లీ ప్రయత్నించండి’ అంటూ వస్తోంది.
► అప్పటికే చెల్లించిన డబ్బు మాత్రం వినియోగదారులకు తిరిగి రావట్లేదు. అతికష్టమ్మీద షాపింగ్ చేసిన పేజ్‌ను గుర్తించి, పరిశీలిస్తే మాత్రం రివ్యూల ద్వారా అసలు విషయం తెలుస్తోంది. వాటిలో వందల మంది తాము మోసపోయాంటూ రాస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment