
మృతురాలు రాజేశ్వరి, గల్లంతైన సుప్రియ(ఫైల్)
మాలూరు(బెంగళూరు): కళాశాల ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరిన ఇద్దరు విద్యార్థినులు కాలువలోకి దూకారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. ఈఘటన బెంగుళూరు రూరల్ జిల్లా ముగళూరు గ్రామం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని బెంగుళూరు రూరల్ జిల్లా హొసకోట తాలూకా బాగూరు గ్రామానికి చెందిన రాజప్ప కుమార్తె ఆర్.రాజేశ్వరి(17)గా గుర్తించారు. గల్లంతైన విద్యార్థిని సుప్రియ(17)ను మాలూరు తాలూకా కోడూరు గ్రామ పంచాయతీకి చెందిన మునియప్ప, లక్ష్మమ్మల కుమార్తెగా గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్నారు.
ఎం.సుప్రియ, రాజేశ్వరిలు చదువుల్లో ప్రతిభావంతులు. మంగళవారం ఉదయం ఎప్పటిలానే కళాశాలకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్లాల్సి ఉండగా బెంగుళూరు రూరల్ జిల్లా ఆనేకల్ తాలూకా ముగళూరు సమీపంలో ప్రవహించే దక్షిణ పినాకిని నది కాలువ వద్దకు వెళ్లారు. సమీపంలోని బేకరిలో తినుబండారాలు కొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో కాలువలోకి దూకారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అనుగొండనహళ్లి ఎస్‌ఐ సంగమేష్, అగ్నిమాపక సిబ్బంది వెళ్లి గాలించగా రాజేశ్వరి విగతజీవిగా కనిపించింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు కార్యాచరణ జరిపినా సుప్రియ ఆచూకీ కనిపించలేదు. తిరిగి బుధవారం ఉదయం నుంచి గాలిస్తున్నా జాడ తెలియలేదు. ఎమ్మెల్యే నంజేగౌడ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. వీరిద్దరూ కాలువలోకి దూకడానికి దారితీసిన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
సూసైడ్ నోట్ లభ్యం
మన పెళ్లికి ఎవరూ అంగీకరించేది లేదని, నీవు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అంటూ సుప్రియ రాసినట్లుగా చెబుతున్న లేఖ ఘటన స్థలంలో లభించినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: Loan Apps: లోన్‌యాప్ వేధింపులకు బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య!