సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ భారీ చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న అక్కడి పోలీసులు నగరంలో దాడి చేశారు. ఆ నేరానికి బాధ్యులైన ఇద్దరు దొంగలను పట్టుకుని తీసుకెళ్లారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ చోరుల విషయం తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా ఏమైనా నేరాలు చేశారా? అనేది ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కమలనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్ బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లారు.
అక్కడే చిన్న చిన్న యంత్రాలు విక్రయించే వ్యాపారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో అమలైన లాక్‌డౌన్ ఫలితంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో మూసేసి తమ స్వస్థలానికి వచ్చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరికి హైదరాబాద్‌కు చెందిన వసీమ్‌తో ఇండోర్‌లో పరిచయం ఏర్పడింది. వీరి పరిస్థితిని గమనించిన వసీమ్ తాను చెప్పినట్లు చోరీలు చేస్తే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని, అప్పులు తీర్చడమే కాకుండా జల్సాగా బతకవచ్చని చెప్పాడు. అందుకు వీరు అంగీకరించడంతో పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ ద్వారా పట్టుకుంటారనే విషయం వారికి చెప్పిన వసీమ్ టార్గెట్ చేసిన ప్రాంతానికి కనీసం పది కిలోమీటర్ల దూరంలోనే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాలని సలహా ఇచ్చాడు.
ఆపై సంప్రదింపులు జరపడానికంటూ ఆన్‌లైన్‌లో చైనా నుంచి అత్యాధునిక వాకీటాకీలు ఖరీదు చేయించాడు. చోరీ చేయాల్సిన ప్రాంతానికి చేరుకోవడానికి ముందే ఈ గ్యాంగ్ కొన్ని కార్లను ఎంపిక చేసుకుని వాటి ఫొటోలు, వివరాలు తెలుసుకునేది. వీటి ఆధారంగా ఆ కార్లకు సంబంధించి ఫాస్ట్‌ట్యాగ్స్ సమీకరించుకునేది. ఆపై అదే మోడల్ కారును అద్దెకు తీసుకుని తాము టార్గెట్ చేసిన ప్రాంతానికి చేరుకుని చోరీ చేసేది. వసీమ్ మాత్రం నేరుగా నేరంలో పాల్గొనకుండా వీరికి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన మొత్తాన్ని అంతా సమానంగా పంచుకునే వారు. ఈ పంథాలో మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్‌లు భోపాల్‌లోని కమలనగర్, ఇండోర్‌లోని సాయి సంపద ఏరియాలతో కొన్ని నేరాలు చేశారు.
గత నెల్లో ఇండోర్‌లోని ఎంఐజీ ప్రాంతంలో నివసించే వ్యాపారి స్వస్తిక్ అగర్వాల్ ఇంట్లో రూ.50 లక్షల సొత్తు తస్కరించారు. వసీమ్ సలహా మేరకు నగరానికి వచ్చేసిన మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్ షేక్‌పేట్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వసీమ్ సూచనలతో ఇక్కడా కొన్ని నేరాలు చేసినట్లు తెలుస్తోంది. వీరి కోసం గాలింపు చేపట్టిన ఇండోర్‌లోని ఎంఐజీ పోలీసులు వారి భార్యల కదలికలపై నిఘా ఉంచారు. ఇటీవల వీరు తమ భార్యల్ని షేక్‌పేటకు పిలిపించుకున్నారు. అలా వీరి ఆచూకీ కనిపెట్టిన ఎంఐజీ పోలీసులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. పరారీలో ఉన్న వసీమ్ కోసం గాలిస్తున్నారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న ఇక్కడి అధికారులు స్థానికంగా చేసిన నేరాలపై ఆరా తీస్తున్నారు.
(చదవండి: ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టి ముగ్గురు మృతి.. ఆత్మహత్యలా? ప్రమాదమా?)
Comments
Please login to add a commentAdd a comment