నిందితుడిని అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్న నాటు తుపాకులు, బంగారం, మోటార్ సైకిల్‌ను చూపుతున్న పోలీసులు
ప్రేమ పేరిట యువతుల్ని దగా చేయడానికి పక్కాగా స్కెచ్ వేశాడు. గూగుల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగినంటూ యువతుల్ని మోసం చేసి దండుకోవడంలో ఆరితేరిపోయాడు. ఇతని ‘ప్రేమ’మాయలో పడిన ఓ యువతి లక్షలు సమర్పించింది. బంగారు ఆభరణాలూ ఇచ్చింది. సెల్‌ఫోన్‌లో పరిచయమై మూడేళ్లైనా కనిపించకుండా, అడ్రస్ చెప్పకుండా దాటవేస్తుండడంతో అనుమానించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ‘అపరిచిత ప్రేమికుడి’ బండారం బట్టబయలైంది.
సాక్షి, పాకాల(చిత్తూరు) : గూగుల్ కంపెనీలో పని చేస్తున్నానని పాకాలకు చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం సెల్‌ఫోన్‌లో ఓ యువకుడు పరిచయం చేసుకున్నాడు. తన పేరు గుణశేఖర్(27) అని, తనది అనంతపురం జిల్లా అని చెప్పాడు. ప్రేమ పేరిట ఆమెను బుట్టలో పడేశాడు. యువతి అతన్ని ప్రత్యక్షంగా చూడలేదు. తనకు అత్యవసరం ఉందంటూ మూడేళ్ల వ్యవధిలో ఆమె నుంచి దాదాపు రూ.10 లక్షలు తీసుకున్నాడు. అతడు కోరినంత మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పంపుతూ వచ్చేది. వ్యవసాయ కూలీలైన ఆమె తల్లిదండ్రులు వివాహం నిమిత్తం ఉంచిన నగలు, నగదును అతగాడికి సమర్పించింది.
వీడియో కాల్ చేసినా ముఖం కనిపించకుండా చాట్ చేస్తుండడంతో చివరకు అనుమానించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేరే పేరుతో ఒకసారి అతడే నేరుగా వచ్చి డబ్బులు తీసుకున్నా ఆ యువతి గుర్తించకపోవడం కొసమెరుపు. ఫిర్యా దును సీరియస్‌గా తీసుకున్న సీఐ ఆశీర్వాదం, ఎస్‌ఐ రాజశేఖర్ సెల్ నంబర్, ఆన్‌లైన్ లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితుడు మండలంలోని మొగరాల పంచాయతీ గొల్లపల్లెకు చెందిన చిన్నస్వామి కుమారుడు అని తేలింది. కృష్ణాపురం వద్ద అతడిని అరెస్టు చేశారు. చదవండి: ఇత్తడి పాత్రకు అద్భుత శక్తి ఉందంటూ..
రికవరీ ఏం చేశారంటే..
నిందితుడి నుంచి రూ.5 లక్షల నగదు, అతడు తన తమ్ముడు జానకిరామ్ పేరుతో కొన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, యువతి నుంచి తీసుకున్న బంగారు నల్లపూసల దండ, ఒక జత బంగారు కమ్మలు, చెంపసారాలు, నిందితుడు ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్, కీప్యాడ్ ఫోన్, ఏటీఎం కార్డులు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఇతడు వన్యప్రాణులను కూడా వేటాడి విక్రయించే వాడని తేలిందని బుధవారం విలేకరులకు సీఐ చెప్పారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు ముక్తీశ్వర్, శివకు సీఐ రివార్డును అందజేశారు. మరికొందరు యువతుల్ని కూడా ఇతడు మోసగించి డబ్బులు పొందినట్లు తేలిందని, బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు. చదవండి: 9 మంది ప్రాణం తీసిన నూడిల్స్
Comments
Please login to add a commentAdd a comment