
ముంబై: కరోనా వైరస్ లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నకిలీ వార్తలు, ప్రాంక్ వీడియోలు వ్యాపింపచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనల సంఖ్య పెరుగుతోంది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ముఖేశ్ గుప్తా 2008లో పదో తరగతి టాపర్. అతను విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. ప్రాంక్ వీడియోలు చేస్తున్నానని చెప్పి.. మైనర్ బాలికల శరీరాలను తాకుతూ, అసభ్యకమైన కామెంట్లు చేస్తూ వీడియోలు తీశాడు. ఆ ప్రాంక్ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.
సుమారు 17 యూట్యూబ్ చానెళ్లు, ఫేస్‌బుక్ అకౌంట్లలో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలను అప్‌లోడ్ చేసి సూమారు రూ. 2 కోట్లు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాంక్ వీడియో తీస్తున్న సమయంలో తమతో అసభ్యంగా మాట్లాడుతూ, లైంగికంగా వేధించాడని కొంతమంది యవతులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా నిందితుడు ముఖేశ్ అప్‌లోడ్ చేసిన ప్రాంక్ వీడియోలను తొలగించాలని యూట్యూబ్‌ను కోరినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబారే తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment