ట్రామాడోల్‌.. తరలింపులో గోల్‌మాల్‌  | Police Arrested Four People Due To Smuggling Tramadol Drug | Sakshi
Sakshi News home page

ట్రామాడోల్‌.. తరలింపులో గోల్‌మాల్‌ 

Published Tue, Mar 22 2022 4:03 AM | Last Updated on Tue, Mar 22 2022 4:03 AM

Police Arrested Four People Due To Smuggling Tramadol Drug - Sakshi

పోలీసులు సీజ్‌ చేసిన ట్రామాడోల్‌ డ్రగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ తరలింపులో ఫార్మా కంపెనీ బండారం బయటపడింది. పేరు లూసెంట్‌. అనుమతులు లేకుండా పాకిస్తాన్‌కు ట్రామాడోల్‌ డ్రగ్‌ను ఎగుమతి చేస్తున్న లూపెంట్‌ ఫార్మా కంపెనీ ఎండీతోపాటు మరో నలుగురిని బెంగుళూర్‌ రీజియన్‌ నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. సంగారెడ్డికి చెందిన లూసెంట్‌ డ్రగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ట్రామాడోల్‌ను ఉత్పత్తి చేసి డెన్మార్క్, జర్మనీ, మలేషి యాకు ఎగుమతి చేసేందుకు అనుమతి కలిగి ఉంది.

కానీ, ఆ దేశాలకు తరలించిన ట్రామాడోల్‌ను అక్కడి నుంచి పాకిస్తాన్‌కు చేరవేస్తున్నట్టు ఎన్‌ సీబీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా బెంగళూర్‌ ఎన్‌సీబీ అధికారులు కేసు నమోదు చేసి.. సంగారెడ్డికి చెందిన ఫార్మా కంపెనీలపై రెండురోజుల క్రితం దాడులు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. గత ఏడాది ఈ ఫార్మా సంస్థ 25 వేల కిలోల ట్రామాడోల్‌ను జర్మనీ, డెన్మార్క్, మలేషియా ద్వారా పాకిస్తాన్‌కు చేరవేసినట్టు కనుగొన్నారు. ట్రామాడోల్‌ తయారీకి అనుమతి పొందిన అసిటిక్‌ అన్‌హైడ్రైడ్‌ డ్రగ్‌ లెక్కల్లో 3.5 కిలోల తేడా గుర్తించినట్టు ఎన్‌సీబీ అధికార వర్గాలు వెల్లడించాయి.

దుష్పరిణామాలు ఇవీ..: ట్రామాడోల్‌ అనేది పెయిన్‌ కిల్లర్‌. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మూర్చ, స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉందని.. మెదడుతో పాటు హృదయం పై దుష్పరిణామాలు పడుతాయని ఎన్‌సీబీ అధికారులు చెప్పారు. హెరాయిన్‌ లాంటి ప్రమాదరకరమైన డ్రగ్స్‌ తయారీకి ఈ ఎసిటిక్‌ అన్‌హైడ్రైడ్‌ కీలక ముడిసరుకని ఎన్‌సీబీ ఆందోళన వ్యక్తం చేసింది. 

గతంలోనూ ఇదే తరహా.. 
హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మూసేసిన, తక్కువ స్థాయిలో డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీలు ఇలాంటి దందాలకు పాల్పడుతున్నట్టు ముంబై, బెంగళూర్‌ నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో విభాగాలు స్పష్టం చేశాయి. గత అక్టోబర్, నవంబర్‌లో గోవాలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి డ్రగ్స్‌ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఇదివరకు పిల్లో కవర్లలో భారీస్థాయి డ్రగ్స్‌ రవాణా చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రగ్స్‌ పట్టుబడటం సంచలనం రేపింది. నిఘా సంస్థలు, ఫార్మా విభాగపు దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యం వల్లే ప్రమాదకరమైన డ్రగ్స్‌ అనుమతి లేకుండా పాకిస్తాన్‌కు తరలుతున్నాయని వాదనలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement