ఆస్తి రాసివ్వలేదని అంతమొందించారు..  | Police Have Arrested The Accused In Assassition Case | Sakshi
Sakshi News home page

ఆస్తి రాసివ్వలేదని అంతమొందించారు.. 

Published Sat, Oct 3 2020 9:05 AM | Last Updated on Sat, Oct 3 2020 9:05 AM

Police Have Arrested The Accused In Assassition Case - Sakshi

హత్యకేసులో అరెస్ట్‌ చేసిన నిందితులను చూపిస్తున్న డీఎస్పీ వెంకట్రావ్, పోలీస్‌ సిబ్బంది  

ఆత్మకూరు(కర్నూలు జిల్లా): ఆస్తి రాసివ్వలేదనే కారణంతోనే గంగయ్యను కిరాయి హంతకులతో భార్య దరగమ్మ, ఆమె బంధువులు అంతమొందించారని ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావ్‌ తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన గంగయ్యకు అదే మండలం చిన్నగుమ్మడాపురానికి చెందిన దరగమ్మతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆరు నెలలు మాత్రమే కాపురం  సజావుగా సాగింది. ఆస్తి అంతా తన పేరుపై రాసివ్వాలని, వేరు కాపురం పెట్టాలని దరగమ్మ గొడవలు పడేది. భర్త మాట వినకపోవడంతో పుట్టినింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని మద్యం సేవించి తరచూ గంగయ్య గొడవపడేవాడు.

ఈ క్రమంలో అతని అడ్డుతప్పించేందుకు దరగమ్మతో పాటు ఆమె తండ్రి ఫక్కీరయ్య, తమ్ముడు మియాసావులు పథకం వేశారు. శివపురం గ్రామానికి     చెందిన కదిరి రవి, మహేష్, పెద్దగుమ్మడాపురం గ్రామానికి చెందిన చెంచు వెంకటేశ్వర్లును సంప్రదించి.. గంగయ్యను చంపితే రూ.2 లక్షలు సుపారి ఇస్తామని మాట్లాడారని,   ఇందుకు రూ.2 వేల అడ్వాన్స్‌ ఇచ్చినట్లు విచారణలో   తేలిందని డీఎస్పీ తెలిపారు. గంగయ్యను సెపె్టంబర్‌ 28వ తేదీన ముసలిమడుగు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి  తీసుకువెళ్లి కర్రతో తలవెనుక భాగాన కొట్టి, గొంతు బిగించి చంపి, శవాన్ని అడవిలో పడేశారన్నారు. లింగాపురం గ్రామ సమీపంలోని ఫక్కీరయ్య, దరగమ్మ, మియాసావు, చెంచు వెంకటేశ్వర్లు, కదిరి రవిని శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వీరి నుంచి రూ. వెయ్యి నగదు, రెండు మోటారు సైకిళ్లు, హత్యకు ఉపయోగించిన కర్ర, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.     నిందితులను మెజి్రస్టేట్‌ ఎదుట హాజరుపరుస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు నాగేంద్రప్రసాద్, నవీన్‌బాబు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement