ముంబై: బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను శుక్రవారం ప్రశ్నించనున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) వెల్లడించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంలో విచారణ చేపట్టిన ఎన్‌సీబీ..బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై దర్యాప్తుచేస్తుండటం తెల్సిందే. ఎన్‌సీబీ పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రశ్నిస్తోంది. వీరిలో బుధవారం దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్‌లకు తదితరులకు సమన్లు పంపింది.
అయితే, ఆ సమన్లు హైదరాబాద్‌లోగానీ, ముంబైలోగానీ తనకు అందలేదంటూ గురువారం ఉదయం రకుల్ ప్రకటించారు. దీంతో, ఫోన్‌తోపాటు వివిధ మార్గాల్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సమన్లు అందుకున్నట్లు ఆమె ధ్రువీకరించారని అనంతరం ఎన్‌సీబీ అధికారి ఒకరు చెప్పారు. శుక్రవారం రకుల్ విచారణలో పాల్గొంటారని కూడా ఆయన వెల్లడించారు. ఇలా ఉండగా, శనివారం జరిగే ఎన్‌సీబీ విచారణలో పాల్గొనేందుకు దీపిక గురువారం రాత్రి గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ఆమె ఇంటివద్ద ముందు జాగ్రత్తగా ముంబై పోలీసులు బందోబస్తు పెంచారు. దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ శుక్రవారం విచారణలో పాల్గొననున్నారు. (ఎన్‌సీబీ నోటీసులు అందాయి: రకుల్)
ఎన్‌సీబీ నోటీసులందుకున్న మరో నటి సారా అలీఖాన్ గురువారం సాయంత్రం గోవా నుంచి ముంబై జుహులోని తన సొంతింటికి చేరుకున్నారు. దీపిక, శ్రద్ధా కపూర్‌తోపాటు ఈమె కూడా శనివారం ఎన్‌సీబీ ఎదుట హాజరుకానున్నారు. సుశాంత్ సింగ్ స్నేహితురాలు రియా చక్రవర్తి విచారణలో వెల్లడించిన సమాచారంలో రకుల్, సారాల ప్రస్తావన కూడా ఉందని అంతకుముందు ఎన్‌సీబీ పేర్కొంది. గురువారం ఉదయం ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాతోపాటు సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీ ముంబైలోని ఎన్‌సీబీ గెస్ట్ హౌస్‌లో విచారణకు హాజరయ్యారు. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నట్లు ఎన్‌సీబీ వెల్లడించింది. (డ్రగ్ కేసు; రకుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ సమన్లు)
కంగన పిటిషన్‌పై సమాధానం ఇవ్వండి
ముంబైలోని తన బంగ్లాలో కొంత భాగాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని శివసేన పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌ను బాంబే హైకోర్టు ఆదేశించింది. అలాగే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వార్డు అధికారి, కంగనాకు కూల్చివేత నోటీసు జారీ చేసిన భాగ్యవంత్‌కు ఇలాంటి ఆదేశాలు ఇచ్చింది. కంగనా పిటిషన్‌పై బాంబే హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కంగనాకు సంజయ్ రౌత్ చేసిన హెచ్చరికలకు సంబంధించిన సీడీని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు. ఈ కేసులో సంజయ్ రౌత్, భాగ్యవంత్‌ను ప్రతివాదులుగా చేర్చాలన్న కంగనా విజ్ఞప్తి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.
డ్రగ్స్ కేసును సీబీఐకి బదిలీ చేయండి: రియా
ముంబై: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంతో సంబంధం ఉందని భావిస్తున్నమాదక ద్రవ్యాల కేసులో విచారణను ప్రారంభించే అధికారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)కి లేదని ఇదే కేసులో నిందితులైన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ స్పష్టం చేశారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి బదిలీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టు గురువారం విచారణ జరిపింది. సుశాంత్‌సింగ్ మరణంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోందని, మాదక ద్రవ్యాల కేసును సైతం అదే సంస్థకు అప్పగించాలని రియా చక్రవర్తి, షోవిక్ తరపు న్యాయమూర్తి సతీశ్ మనేషిండే బాంబే హైకోర్టునుకోరారు.
Comments
Please login to add a commentAdd a comment