
ఉగాది పండుగకు అక్క కుటుంబాన్ని తీసుకొని కారులో అవర్కకు వెళ్తుండగా అంకోలా వద్ద అతడి కారును లారీ ఢీకొంది.
యశవంతపుర: ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఓ వ్యక్తి తన అక్క బావలను, వారి పిల్లలను కారులో తీసుకెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు పంజా విసిరి ఇద్దరిని బలి తీసుకుంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తర కన్నడ జిల్లా అంకోలా వద్ద 63వ జాతీయరహదారిపై చోటు చేసుకుంది. వివరాలు.... అంకోలా తాలూకా అవర్కకు చెందిన గురుప్రసాద్ అణ్వేకర్(32) పుణేలో ఉంటున్నారు. ఉగాది పండుగకు అక్క కుటుంబాన్ని తీసుకొని కారులో అవర్కకు వెళ్తుండగా అంకోలా వద్ద లారీ ఢీకొంది.
కాగా ప్రమాద తీవ్రతకు కారు నుజ్జుయ్యింది. దీంతో గురుప్రసాద్, అక్కకుమార్తె సంజన రాయ్కర(7) అక్కడికక్కడే మృతి చెందారు. బావ సంతోష్ రాయ్కర, అక్క అశ్విని, ఆమె కుమారులు సోహన్ రాయ్కర, ప్రీతం రేవణకరలు తీవ్రంగా గాయపడగా అంకోలా ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడు గురుప్రసాద్ వాలీబాల్‌లో మంచి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఘటనపై అంకోలా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: చూడముచ్చటగా ఉన్నారు.. ఎంత పనై పోయింది