
స్వాధీనం చేసుకున్న గంజాయిని చూపిస్తున్న సీపీ స్టీఫెన్ రవీంద్ర
మియాపూర్: ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర నాసిక్‌కు గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు, మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన వికాస్‌జాదవ్, ఒడిస్సా, మోహిపాల్‌పుట్‌కు చెందిన సుభాష్‌కుమార్, మహారాష్ట్రకు చెందిన చెందిన అశోక్‌కూలే, అమోల్, విలాస్ జగనాథ్ పచోరే, ఫిరోజ్ మోమిన్, సుధామ్ గౌటేకర్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్‌సింగ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి నాసిక్‌కు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారు.
అక్కడ కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి రూ. 20 వేలకు విక్రయిస్తున్నారు. కోరాపుట్‌లో సుభాష్‌కుమార్ గంజాయి సాగు చేస్తుండగా వికాస్ జాదవ్ అతడి నుంచి గంజాయి కొనుగోలు చేసి అశోక్‌కూలే, అమోల్‌కు అప్పగించేవాడు. వారు విలాస్‌జగనాథ్, రాహుల్ కుమార్, ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో నాసిక్‌కు గంజాయి తరలించేవారు. వారం రోజుల క్రితం వికాస్ జాదవ్, సుభాష్‌కుమార్ 800 కిలోల గంజాయిని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేయాలని నిర్ణయించారు. వికాస్ జాదవ్, అశోక్‌కూలే, అమోల్‌కు ఈ విషయం చెప్పడంతో వారు జగన్నాథ్, రాహుల్‌కుమార్ సింగ్‌లకు ఫోన్ చేసి తమ ప్లాన్‌ను వివరించారు.
ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో గంజాయిని ఐదు కిలోల చొప్పున 156 ప్యాకెట్లుగా సిద్ధం చేశారు. ఈ నెల 19న అశోక్‌కూలే, రాహుల్‌కుమార్ సింగ్ కారులో ముందు వెళుతుండగా, విలాస్ జగన్నాథ్, సుధామ్ డీసీఎంలో వారిని అనుసరించారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎం పై భాగంలో అల్లం సంచులను లోడ్ చేశారు. టోల్ ప్లాజాల వద్ద పోలీసుల నిఘా ఉంటుందనే అనుమానంతో ఇతర హైదరాబాద్‌కు చేరుకున్నారు.
దీనిపై సమాచారం అందడంతో శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు, మియాపూర్ పోలీసులు మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై కారు, డీసీఎంను ఆపారు. కారులో ఉన్న అశోక్‌కూలే, రాహుల్‌కుమార్‌సింగ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా డీసీఎంలో 800 కిలోల గంజాయిని నాసిక్‌కు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అశోక్‌కూలే, అమోల్, రాహుల్‌కుమార్ సింగ్, విలాస్‌జగనాథ్, ఫీరోజ్ మోమిన్, సుధామ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు వికాస్‌జాదవ్, సుభాష్‌కుమార్ పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటున్నామని సీపీ తెలిపారు.
♦ 800 కిలోల గంజాయితో పాటు డీసీఎం, ఐ 20 కారు, ఐదు మొబైల్స్, రూ.2,130 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీ మియాపూర్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ తిరుపతిరావు, ఎస్‌ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment