సాక్షి, హైదరాబాద్: ‘పిగ్ బుచ్చరింగ్’... తరహాకు చెందిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిపోయాయని నగర సంయుక్త పోలీసు కమిషనర్ (నేరాలు) ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ స్కామ్స్‌లో మోసపోతున్న వారిలో చార్టెడ్ అకౌంటెంట్లు, ఏళ్లుగా ట్రేడింగ్ చేస్తున్న నిపుణులతో పాటు విద్యాధికులు ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ప్రతి రోజూ కనిష్టంగా నాలుగు కేసులు నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ జరుగుతున్న విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
అదే పంథా ఇక్కడ అమలు...
మాంసం వ్యాపారులు పంది బక్కపలుచగా ఉన్నప్పుడు దాన్ని వధించరు. కొన్నాళ్లపాటు దానిని మేపడం ద్వారా బలిష్టంగా చేసి ఆపై మాంసంగా మారుస్తారు. పిగ్ బుచ్చరింగ్‌గా పిలిచే ఈ విధానాన్నే ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్ చేసే నేరగాళ్లు అనుసరిస్తున్నారు. ట్రేడింగ్ పేరుతో వివిధ రకాలైన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ప్రకటనలు గుప్పిస్తున్న నేరగాళ్లు పలువురిని ఆకర్షిస్తున్నారు. ఇలా తమ వల్లోపడిన వారికి పూర్తి నమ్మకం కలగడం కోసం కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. వీటి ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ తదితర గ్రూపుల్లో వారికి సభ్యులుగా చేస్తున్నారు. ఆపై ప్రత్యేక లింకుల ద్వారా తమ యాప్స్ టార్గెట్ చేసిన వారి ఫోన్లలో డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. దీని డ్యాష్‌బోర్డ్‌లో సదరు వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టారు? ఎంత లాభం వచి్చంది? మొత్తం ఎంతకు పెరిగింది? తదితరాలు కనిపిస్తూ ఉంటాయి. తొలినాళ్లల్లో వాళ్లు పెట్టిన పెట్టుబడికి రూ.వేలల్లో లాభాలు ఇచ్చి పూర్తిగా నమ్మిస్తారు. ఆపై పెట్టుబడి మొత్తాన్ని రూ.లక్షలు, రూ.కోట్లకు పెంచేలా చేస్తారు.
ఆ గ్రూపుల నిండా ‘లాభాలే’...
ఈ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌కు సంబంధించిన యాప్‌ల్లో కొన్ని ప్రముఖ సంస్థల పేర్లతో, వాటి లోగోలతో ఉంటుండటంతో బాధితులు తేలిగ్గా మోసపోతున్నారు. వీరు సభ్యులుగా ఉండే గ్రూపులకు ప్రీమియం, వీఐపీ లాంటి పేర్లు పెడతారు. వీటిలో అత్యధికులు సైబర్ నేరగాళ్ల అనుచరులే సభ్యులుగా ఉంటారు. వారు ప్రతి రోజూ తనకు ఇంత మొత్తం లాభం వచి్చంది, అంత మొత్తం లాభం వచి్చంది అంటూ కామెంట్స్ పోస్టు చేస్తారు. దీంతో పాటు తమ యాప్స్‌కు సంబంధించి డ్యాష్‌బోర్డులు, నగదు తమ ఖాతాల్లో మళ్లినట్లు చూపించే కలి్పత సందేశాలను ఈ గ్రూపుల్లో పొందుపరుస్తారు.
ఇవి చూసిన బాధితులు పూర్తిగా నమ్మేస్తారు. అప్పటి నుంచి సైబర్ నేరగాళ్లు వీళ్లు పెట్టే పెట్టుబడులను తమ సొంత ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తారు. ప్రతి దశలోనూ భారీ లాభాలు వచ్చాయంటూ సందేశాలు పంపడంతో పాటు యాప్‌ల డ్యాష్ బోర్డుల్లోనూ ఆ మొత్తాన్ని చూపిస్తుంటారు. కొన్ని రోజుల తర్వాత వాటిలోని విత్‌డ్రా ఆప్షన్ డిజేబుల్ చేసేసి బాధితులు తమ నగదు వెనక్కు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తారు. అప్పటికే వీరి నుంచి భారీ మొత్తం పెట్టుబడిగా తీసేసుకుని ఉంటారు. దీంతో ఈ మొత్తం అది నష్టపోతామనే ఉద్దేశంతో బాధితులు నేరగాళ్లు చెప్పినట్లు చేయడానికి సిద్ధమవుతారు.
అసలు కథ మొదలెట్టి వీలైనంత...
దీనిని క్యాష్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు డ్యాష్‌బోర్డులో కనిపిస్తున్న వర్చువల్ ఖాతాల్లో నగదు డ్రా చేసుకోవాలంటే నిరీ్ణత మొత్తం పెట్టుబడి పెట్టాలని మరికొంత డిపాజిట్ చేయించుకుంటారు. చివరకు ఆదాయపు పన్ను, జీఎస్టీ తదతర చెల్లింపుల పేరుతో మిగిలిన మొత్తం కాజేసి... ఆ యాప్, గ్రూపులు పని చేయకుండా చేస్తారు. ఇలా భారీ మొత్తాలు స్వాహా చేస్తున్న ఈ యాప్స్ వెనుక చైనీయులే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ తరహా కేసుల్లో బాధితుల నుంచి కాజేసిన మొత్తం క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో దేశం దాటిపోతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ మోసాల నేపథ్యంలో కేవలం సెబీ అనుమతి ఉన్న సంస్థలు, యాప్‌ల ద్వారానే ట్రేడింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. డీమ్యాట్ ఖాతాల ద్వారా మాత్రమే లావాదేవీలు చేయాలని, బ్రోకర్ల సహా ఎవరి వ్యక్తిగత ఖాతాల్లోని నగదు బదిలీ చేయవద్దని స్పష్టం చేస్తున్నారు. అపరిచిత గ్రూపుల్లోని పోస్టులు నమ్మడం, లింకుల ద్వారా వచ్చే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం కూడదని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment