దారుణం: మామ గొంతు కోసిన అల్లుడు | Son In Law Assassination Uncle In Vijayawada | Sakshi
Sakshi News home page

మామ గొంతు కోసిన అల్లుడు

Published Thu, Feb 18 2021 11:06 AM | Last Updated on Thu, Feb 18 2021 11:06 AM

Son In Law Assassination Uncle In Vijayawada - Sakshi

సాంబశివరావు (ఫైల్‌) 

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): కుటుంబ కలహాల నేపథ్యంలో మామ గొంతు కోసి హత్య చేసిన ఘటన విజయవాడ నగరంలోని కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెస్ట్‌ ఏసీపీ హనుమంతరావు, కొత్తపేట సీఐ ఎండీ ఉమర్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి భార్య, కుమార్తెల నుంచి వివరాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. కొత్తపేట గున్నాబత్తుల అచ్చయ్యవీధిలో చింతపల్లి సాంబశివరావు(70), పార్వతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, ఇద్దరు మగ సంతానం. కుమార్తె సావిత్రి, అల్లుడు కేళ్ల ప్రభాకర్‌లు ఊర్మిళానగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రభాకర్‌ పెళ్లికి ముందు రైల్వేలో ఉద్యోగం చేసేవాడు. మద్యం తాగి డ్యూటీ చేస్తుండటంతో ఉద్యోగం నుంచి తొలగించారు.

పెళ్లి తర్వాత ఓ ఏడాది దుబాయ్‌ కూడా వెళ్లి వచ్చాడు. అయితే ప్రస్తుతం ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. ప్రభాకర్‌ భార్య సావిత్రితో తరుచూ గొడవ పడుతూ ఉండేవాడు. రెండు నెలల కిందట ఇదే రీతిలో గొడవ పడటంతో సావిత్రి కొత్తపేటలోని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. భార్యను తనతోపాటు పంపాలని ప్రభాకర్‌ అత్తమామలతో తరుచూ గొడవ పడుతూ ఉంటాడు. భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో తాను కాపురానికి వెళ్లనని సావిత్రి తెగేసి చెప్పింది. కొద్ది రోజుల కిందట సావిత్రికి రోడ్డు ప్రమాదం జరగడంతో కాలికి గాయమైంది. బుధవారం కాలికి ఉన్న కట్టు విప్పించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లడంతో ఇంట్లో అత్తమామలిద్దరే ఉన్నారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన ప్రభాకర్‌ అత్తమామలతో గొడవ పడ్డాడు.

ఈ క్రమంలో ప్రభాకర్‌ తనతోపాటు తెచ్చుకున్న చాకుతో మామ గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. సాంబశివరావు ఇంటి గుమ్మం వద్ద పెద్ద శబ్దంతో పడటంతో లోపల ఉన్న అత్త పార్వతి బయటకు వచ్చి చూసే సరికి ప్రాణాలను వదిలేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు చేరుకుని నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలను నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి
అనంతలో అమానుషం: టీడీపీకి ఓటు వేయలేదని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement