సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిలు మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులోనూ మధ్యంతర బెయిలు ఇవ్వాలన్న చంద్రబాబు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణ శుక్రవారం చేపడతామని పేర్కొంది. అప్పటి వరకూ చంద్రబాబును అరెస్టు చేయొద్దని చెప్పింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఇరుపక్షాల వాదనలు పీసీ చట్టం సెక్షన్ 17ఏ పైనే జరిగాయి. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రంజిత్‌కుమార్, నిరంజన్‌రెడ్డి వాదించగా, చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపించారు.
తొలుత సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 17ఏ ఈ కేసుకు వర్తించదని చెప్పారు. ఇది 2018 కన్నా ముందు జరిగిన నేరమని, ఆ సమయంలో ఉనికిలోనే లేని చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. 2018 జూన్‌లోనే విచారణ ప్రారంభించామని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో కాగ్నిజబుల్ నేరాలు ఉన్నాయా.. లేదా.. అనేది చూడాలని చెప్పారు. సెక్షన్ 17ఏ నిజాయితీపరులకే తప్ప అవినీతిపరులకు రక్షణ కవచం కాకూడదని చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అవినీతి జరిగిందని స్పష్టంగా కనిపిస్తోందని, అటువంటప్పుడు సెక్షన్ 17ఏ అసలు వర్తించదని చెప్పారు. రూ. వందల కోట్ల కుంభకోణం దర్యాప్తును అడ్డుకోవడానికి ఈ సెక్షన్‌ను ఉపయోగించరాదని అన్నారు. 2015–16లో చట్టంలో లేనివి వర్తించవని చెప్పారు. సెక్షన్ 17ఏ భవిష్యత్తుకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. పీసీ చట్టానికి సంబంధం లేని అభియోగాలపై విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉందని పలు కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ గట్టిగా వాదనలు వినిపించారు.
ఒక వ్యక్తి పీసీ చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం నిందితుడు అయితే.. ఏదైనా కారణాలతో పీసీ చట్టం నేరాలను దాని నుంచి తొలగించినప్పటికీ, ప్రత్యేక న్యాయమూర్తి మిగిలిన ఐపీసీ కింద సెక్షన్లపై చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం విచారణ చేయొచ్చని తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక కోర్టు నిందితుడి విడుదలకు నిరాకరించిందని తెలిపారు. ప్రస్తుత కేసులో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నామని, డిశ్చార్జి ఉందా లేదా అనేది పక్కనపెడితే.. పోలీసుల దర్యాప్తులో పీసీ లేదా పీసీయేతర అభియోగాల మధ్య తేడా లేనప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను ఎలా క్వాష్ చేస్తారని ప్రశ్నించారు.
ఇది రాజకీయ కక్ష కాదని, కేంద్ర దర్యాప్తు సంస్థల ఆరోపణలపైనా దర్యాప్తు జరిగిందని తెలిపారు. ఒకవేళ సెక్షన్ 482 విచక్షణ ప్రకారం రిలీఫ్ ఇవ్వాలంటే దానికి కొన్ని ప్రిన్సిపుల్స్ ఉన్నాయన్నారు. ఈ కేసుకు ఆ అర్హత కూడా లేదని కౌంటర్ అఫిడవిట్‌ను పరిశీలిస్తే అర్థం అవుతుందని తెలిపారు. సుప్రీంకోర్టే ప్రాథమిక విచారణ చేయాలనుకోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా తన వాదనలను సమర్థించే వేర్వేరు తీర్పులను ధర్మాసనం ముందుంచారు.
40 రోజులుగా జైల్లో ఉన్నారు బెయల్ ఇవ్వండి
చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. రాజకీయ కక్ష సాధింపులు నిరోధించేందుకే 17ఏ ఉందని, ఇది చట్టం కల్పించిన రక్షణ అని చెప్పారు. రాష్ట్ర వాదన చూస్తుంటే.. సెక్షన్ 17ఏ అమాయకులైన వారికే వర్తిస్తుందన్నట్లుందని చెప్పారు. నిర్దోషులని నిర్ధారించడానికి నిర్దోషిత్వంపై ముందుగా విచారణ నిర్వహించాలంటూ ప్రొవిజన్ తలక్రిందులు చేస్తున్నారని ఆరోపించారు.
జీఎస్టీ చెల్లింపులకు, ప్రభుత్వానికి ముడిపెడుతున్నారన్నారు. 2021లో విచారణ ప్రారంభించి ఆధారాల కోసం మళ్లీ వెదుకుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చెప్పారు. 40 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని, మద్యంతర బెయిలు ఇవ్వాలని సాల్వే అభ్యర్థించారు. సాల్వే వాదనలను లూథ్రా సమర్థించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను 19కి వాయిదా వేసిన హైకోర్టు
చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌లో తదుపరి విచారణను నెల 19వ తేదీకి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా, చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాయిదా వేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment